రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ‘చలో బస్ భవన్’ కార్యక్రమం ఉద్రిక్తంగా జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు.
బస్సులో బస్ భవన్‌కు…
పోలీసుల నిర్బంధాన్ని ఛేదించి కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ కలిసి రెత్తిఫైల్ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బస్ భవన్‌కు చేరుకున్నారు. మరోవైపు, మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా మెహిదీపట్నం నుంచి బస్సులో ప్రయాణించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బస్ భవన్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎండీని ప్రశ్నలతో ముంచెత్తిన కేటీఆర్
బస్ భవన్ లోపలికి వెళ్లడానికి ఎమ్మెల్యేలకు మాత్రమే అనుమతి లభించింది. లోపలికి వెళ్లిన కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని, పద్మారావు తదితర ఎమ్మెల్యేలు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిశారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ పార్టీ తరపున ఆయనకు లేఖ అందజేశారు. అలాగే, ఆర్టీసీకి ప్రభుత్వ బకాయిలు ఎంత ఉన్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్, ఎండీ నాగిరెడ్డిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. “ఇప్పటికే ఆర్టీసీ కార్గో సేవలను ప్రైవేట్‌పరం చేశారు. త్వరలో ఆర్టీసీని కూడా ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందా?” అని నిలదీశారు. దీనికి బదులిచ్చిన ఎండీ నాగిరెడ్డి, అలాంటి నిర్ణయం ఏదీ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. చలో బస్ భవన్ కార్యక్రమానికి ముందు పోలీసులు కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
“పెంచిన ఛార్జీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆర్టీసీ ఎండీ కార్యాలయంకు వెళ్లి ఒక లేఖ ఇద్దామని పార్టీ పిలుపునిచ్చింది. ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని కోరాలని అనుకున్నాం. ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్తామంటే మా ఇంటి ముందు ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. ఒక వ్యక్తిని బస్సు ఎక్కకుండా ఆపడం కోసం ఇంతమంది పోలీసులను పంపారు. మమ్మల్ని నియంత్రించడంలో పోలీసులకు ఉన్న ఉత్సాహం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరుగుతున్న నేరాల అదుపులో చూపిస్తే మంచిది,” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
“ఎన్ని రకాల కుట్రలు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకునే వరకు మా నిరసన కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి పోలీసు నిర్బంధాలు మాకు, మా పార్టీకి కొత్త కాదు,” అని ఆయన స్పష్టం చేశారు.









ఇకపై ‘దొరసాని’ని చూస్తారు – కవితపై బీజేపీ ఎంపీ సెటైర్లు