సూర్యాపేట (Suryapet) మండలంలోని తాళ్లకంభంపహాడ్ (Thallakambhampahad) గ్రామంలో జరిగిన దారుణ ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. 13 ఏళ్ల మైనర్ బాలిక (Minor girl)పై ముగ్గురు ఉన్మాదులు గ్యాంగ్ రేప్ (Gang Rape) యత్నానికి పాల్పడటంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాలిక గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని నిందితులను పట్టుకున్నారు. అయితే వారిలో ఒకరు పరారైపోగా, మిగతా ఇద్దరిని గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు.
ఈ ఘటన తాళ్లకంభంపహాడ్ గ్రామం ముత్తాలమ్మ కాలనీలో చోటుచేసుకుంది. నూతనంగా నిర్మాణంలో ఉన్న ఇంట్లో ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి ఉండగా, పక్కింటిలో ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేశారు. అనంతరం బాలికను బలవంతంగా అదే నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. బాలిక భయంతో గట్టిగా అరవడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని బాలికను రక్షించారు.
అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితులను పాలపు సాయికుమార్ (Palapu Saikumar), మహేశ్వర రాజు (Maheshwara Raju), వలమల్ల సాయి (Valamalla Sai)గా పోలీసులు గుర్తించారు. వారిలో ఒకరు బైక్‌పై పరారైపోగా, మిగతా ఇద్దరిని స్థానికులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపింది. నిన్ననే నల్లగొండ జిల్లా కేంద్రంలో మైనర్ బాలికపై అత్యాచారం, హత్య జరిగిన నేపథ్యంలో 24 గంటల్లోపే మరో దారుణం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. వరుస ఘటనలతో ఆడబిడ్డల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.







