భారీ మంచు తుఫాన్ (Snow Storm) ఒక్కసారిగా విరుచుకుపడింది. వందలాది మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ పర్వతం (Everest Mountain)పై చిక్కుకుపోయారు. పర్వతారోహకుల కోసం టిబెట్ పర్వత ప్రాంతంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. చైనా ప్రభుత్వ మీడియా ప్రకారం.. ఎవరెస్ట్ తూర్పు వైపున ఉన్న దూరప్రాంత శిబిరాల వద్ద మంచు తుఫాన్ తీవ్రంగా విరుచుకుపడింది. 4,900 మీటర్ల ఎత్తులో ఉన్న ఆ ప్రాంతానికి వెళ్లే దారులు మంచుతో మూసుకుపోవడంతో, వందలాది స్థానిక గ్రామస్తులు, రక్షణ సిబ్బంది ఆ మంచును తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 350 మందిని సురక్షిత ప్రాంతమైన క్వుడాంగ్ పట్టణానికి తరలించారు. అయితే ఇంకా 200 మంది పర్వతారోహకులతో అధికారులు సంప్రదింపులు కొనసాగిస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన భారీ మంచు వర్షం, టిబెట్‌లోని ఎవరెస్ట్ తూర్పు ఫేజ్‌లో మరింత తీవ్రమైంది. ఈ ప్రాంతం పర్వతారోహకులు, ట్రెక్కర్లు తరచూ వెళ్లే ప్రముఖ పర్యాటక ప్రదేశం. 29 ఏళ్ల ఔట్‌డోర్ ప్రియురాలు గెషువాంగ్ చెన్ తన బృందంతో అక్టోబర్ 4న క్వుడాంగ్ పట్టణం నుంచి చో ఓయు బేస్ క్యాంప్ వైపు పయనమయ్యారు. ఐదు రోజుల్లో హిమాలయ పర్వత శ్రేణుల అద్భుత దృశ్యాలను చూడాలనేది వారి యోచన. ఆ రోజు స్వల్పంగా మంచు పడుతుందని, మరుసటి రోజు ఆగిపోతుందని వాతావరణ సూచనలో తెలిపినప్పటికీ, వారి ప్రణాళికలు భగ్నమయ్యాయి. తీవ్రమైన బ్లిజార్డ్ దాడి చేసింది.
“మేము లేచే సరికి మంచు ఇప్పటికే ఒక మీటర్ ఎత్తుకు చేరింది,” అని చెన్ తెలిపారు. “మేమంతా అనుభవజ్ఞులైన ట్రెక్కర్లమే అయినా, ఈ బ్లిజార్డ్ చాలా కఠినంగా అనిపించింది. నేను బయటపడటం అదృష్టంగా భావిస్తున్నాను” అని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆమె లాసా నగరానికి తిరుగు ప్రయాణం చేస్తున్నారు. “గోల్డెన్ వీక్ సందర్భంగా ఇక్కడికి చాలామంది వస్తారు, కానీ ఈ ఏడాది మంచు తీవ్రత అసాధారణం,” అని చెన్ పేర్కొన్నారు. వారి గైడ్ కూడా ఇలాంటి వాతావరణం ఎవరెస్ట్ తూర్పు వైపున చాలా అరుదుగా వస్తుందని తెలిపారు.
చైనాలో ప్రస్తుతం “గోల్డెన్ వీక్” పేరుతో జాతీయ సెలవులు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో వేలాది పర్యాటకులు టిబెట్ వైపు తరలివెళ్తారు. కర్మా వ్యాలీ ట్రెక్కింగ్ ట్రైల్ ఈ సీజన్లో ప్రధాన ఆకర్షణగా ఉంది. చైనాలోని దక్షిణ నగరం షెన్జెన్కు చెందిన ఓ మహిళ తెలిపినట్లుగా, మంచు తుఫాన్లో చిక్కుకున్న తన భర్త మెల్లగా పర్వతాల నుంచి వెనక్కు వస్తున్నాడని తెలిపారు. “మార్గం చాలా కఠినంగా ఉంది, రక్షక సిబ్బంది కూడా ముందుకు సాగడం కష్టమే, మంచును తొలగించాల్సి వస్తోంది” అని ఆమె చెప్పారు. ఆమె భర్త మాట్లాడుతూ, “రాత్రంతా మంచులో కూరుకుపోతాననే భయంతో నిద్రపోలేకపోయాను” అని తెలిపారు.
మరో ట్రెక్కర్ ఎరిక్ వెన్ తెలిపిన వివరాల ప్రకారం, అతని బృందంలోని ముగ్గురికి హైపోథర్మియా లక్షణాలు (తీవ్రంగా శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవడం) కనిపించాయి. “ప్రతి 10 నిమిషాలకోసారి మంచును తొలగించకపోతే టెంట్లు కూలిపోయేవి,” అని ఆయన రాయిటర్స్‌కు తెలిపారు.
8,849 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ ప్రతి సంవత్సరం వందలాది మంది పర్వతారోహకులను ఆకర్షిస్తుంది. కానీ, తాజాగా సంభవించిన భారీ మంచు తుఫాన్ కారణంగా ఇది అత్యంత ప్రమాదకరమైన పర్వతయాత్రగా భావిస్తున్నారు.







