ఎన్నికల కమిషన్ (Elections Commission)పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఓటు చోరీ (Theft) పై ఢిల్లీలో ప్రెస్‌మీట్ నిర్వహించిన రాహుల్.. ఓట్ల తొలగింపు ఉద్దేశపూర్వకంగానే జరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారిని ఈసీ కాపాడుతోందని, తాను చేస్తున్న ఆరోపణలకు వంద శాతం ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. నకిలీ అప్లికేషన్లు, ఫేక్ లాగిన్ ఐడీల ద్వారా లక్షలాది ఓటర్ల పేర్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.
కాంగ్రెస్‌కు బలమైన ప్రాంతాల్లోనే ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్లను తొలగించేలా దరఖాస్తులు చేసారని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులనే లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ విధానంతో వేల ఓట్లు తొలగించబడ్డాయని, కేవలం కర్ణాటకలోనే 6,800 ఓట్లను డిలీట్ చేశారని రాహుల్ ఉదహరించారు.
పూర్తిగా ప్లాన్ ప్రకారమే ఈ ప్రక్రియ సాగుతోందని ఆయన అన్నారు. ఇందుకోసం సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఏర్పాటు చేసి, ఇతర రాష్ట్రాల ఫోన్ సెంటర్లను ఉపయోగించి కర్ణాటకలో ఓట్లు తొలగించారని ఆరోపించారు. లింక్‌డ్ మొబైల్ నెంబర్లన్నీ తప్పుడు నెంబర్లేనని, ఆ నెంబర్లు ఎవరివి, ఎవరు ఆపరేట్ చేశారని ప్రశ్నించారు.
సూర్యకాంత్ అనే ఒకే ఒక్క పేరుతో కేవలం 12 నిమిషాల వ్యవధిలో 14 అప్లికేషన్లు వెళ్లడం అనేది వ్యవస్థపై పెద్ద అనుమానాలు కలిగించే అంశమని రాహుల్ గాంధీ తెలిపారు. దళితులు, ఆదివాసీల ఓట్లు తొలగించడం ద్వారా ప్రజాస్వామ్య హక్కులను కాజేస్తున్నారని విమర్శించారు. అధికారులకు తెలియకుండానే ఓట్లు పోతున్నాయంటే ఇది స్పష్టంగా వ్యవస్థను హైజాక్ చేస్తున్నట్లు నిరూపిస్తోందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.







