ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాలు (Assembly Meetings) ఈనెల 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఎసీ) (BAC) సమావేశంలో 10 పనిదినాల పాటు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) అధ్యక్షత వహించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, జీవీ ఆంజనేయులు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు హాజరయ్యారు.
20, 21, 28 తేదీల్లో సభకు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని, ప్రశ్నోత్తరాల సమయంలోనే కాకుండా జీరో అవర్‌లో కూడా మంత్రులు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లుగా సమాచారం.
సభలో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) తరఫున 18 అంశాలు ప్రతిపాదించగా, బీజేపీ 9 అంశాలను సూచించింది. నేడు జీఎస్టీపై ప్రత్యేక చర్చ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులు తగ్గించడం వల్ల ధరలు తగ్గిన విధానం, ప్రజలకు కలిగిన లాభం గురించి సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయనున్నారు. ఈ అంశంపై పలువురు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ సమాధానం ఇవ్వనున్నారు.
రేపు జలవనరులపై చర్చ జరగనుండగా, 22న శాంతి భద్రతలు, 23న వైద్య ఆరోగ్యం, 24న పరిశ్రమలు, 25న సూపర్6 పథకాలు, 26న క్వాంటం, 27న లాజిస్టిక్స్, 29న స్వర్ణాంధ్ర దిశగా ఏపీ అభివృద్ధి, 30న రాయలసీమ–కోస్తా–ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు.







