ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సంస్థలోని సభ్యులకు శుభవార్త అందించింది. ఈపీఎఫ్‌ఓ 3.0 అమలు కాగానే ఇకపై పీఎఫ్ డబ్బు విత్‌డ్రా కోసం రోజులు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. దీపావళి నుండి ఏటీఎం లేదా యూపీఐ యాప్‌ల ద్వారా రూ.లక్ష వరకు అత్యవసర విత్‌డ్రాలను వెంటనే చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి పైగా సభ్యులు లాభపడనున్నారు.
కొత్త వ్యవస్థ ముఖ్యాంశాలు
పీఎఫ్ ఖాతాలు భవిష్యత్తులో బ్యాంక్ ఖాతాల్లా పనిచేయనున్నాయి. ఇప్పటివరకు ఆన్‌లైన్ క్లెయిమ్ సబ్మిట్ చేసి డబ్బులు రావడానికి సమయం పడుతుండేది. కొత్త సిస్టంలో యూఏఎన్, ఆధార్–బ్యాంక్ లింక్ ఉంటే చాలు. వైద్య ఖర్చులు, విద్య, ఇల్లు, వివాహ అవసరాల కోసం వెంటనే విత్‌డ్రా చేయగలరు. ప్రస్తుతం నెలకు రూ.1,000గా ఉన్న కనీస పింఛన్‌ను రూ.1,500–రూ.2,500కి పెంచే ప్రతిపాదనపై కూడా చర్చ జరుగుతోంది.
భారీ సంస్కరణల దిశగా
ట్రేడ్ యూనియన్లు కోరుతున్న పాత డిమాండ్లలో ఇది ఒకటి. ఈపీఎఫ్‌ఓ 3.0 అమలైతే, భారత పీఎఫ్ వ్యవస్థలో ఇదే అతిపెద్ద సంస్కరణగా నిలవనుంది. ఉద్యోగులకు అత్యవసర సమయాల్లో ఇది గొప్ప ఆర్థిక సాయం కానుంది.