భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు రోజర్ బిన్నీ పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ స్థానం కోసం పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ, టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. ఈ ప్రచారానికి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) తీసుకున్న ఒక నిర్ణయం మరింత బలాన్ని చేకూర్చింది.
పీసీఏ, హర్భజన్ సింగ్‌ను తమ ప్రతినిధిగా బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశానికి (AGM) నామినేట్ చేసింది. దీంతో హర్భజన్ ఈ సమావేశంలో పాల్గొని అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నెల 28న బీసీసీఐ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే కొత్త అధ్యక్షుడి పేరు ఖరారు అయ్యే అవకాశం ఉంది. గతంలో సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీ వంటి మాజీ క్రికెటర్లు ఈ పదవిలో కొనసాగారు. హర్భజన్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. ఈ పదవి ఆయనకు లభిస్తే మరో ప్రపంచకప్ విజేతకు అరుదైన గౌరవం దక్కినట్లు అవుతుంది.