విశాఖ (Visakha) ఉక్కు ప్లాంట్ (Steel Plant) ప్రైవేటీకరణ (Privatization) కుట్రపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కాంగ్రెస్ అధ్యక్షురాలు (Congress President) వైఎస్ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు. నేడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ముగ్గురు చంద్రబాబు (Chandrababu), లోకేష్ (Lokesh), పవన్ (Pawan) విశాఖపట్నంలోనే ఉన్నా.. ఒక్కరైనా ఉక్కు ప్లాంట్‌ను సందర్శించలేదని ఆమె ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యోగాలను నాశనం చేసే 44 టెండర్లను కేంద్రం ఇచ్చిందని, ఇది మోడీ(Modi) చేస్తున్న సైలెంట్ కిల్లింగ్ అని షర్మిల ఆరోపించారు.
ఒకప్పుడు వైఎస్ హయంలో 35 వేలమంది పనిచేసే ప్లాంట్‌లో ఇప్పుడు 20 వేలకు తగ్గించారని ఆమె గుర్తుచేశారు. రా మెటీరియల్ సరఫరా తగ్గించడం, సొంత మైనింగ్ హక్కులు ఇవ్వకపోవడం వల్లే ప్లాంట్‌ను అప్పుల్లోకి నెట్టారని ఆమె తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవం, నాలుగు లక్షల కోట్ల విలువైన ఆస్తులపై మోడీ కన్నేశారని షర్మిల మండిపడ్డారు.
టీడీపీ(TDP), జనసేన(Janasena)పై కూడా షర్మిల విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో గెలవడం కోసం స్టీల్ ప్లాంట్ కొరకు పోరాటం చేస్తామని చెప్పిన బాబూ, పవన్ ఇప్పుడు మోడీకి మద్దతు ఇస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. “చంద్రబాబుకు తెలుగు జాతి కంటే మోడీ ఖ్యాతి ముఖ్యం.. పవన్‌కు విశాఖ ఉక్కు కంటే ఢిల్లీతో సఖ్యత ముఖ్యం” అని ఆమె ఎద్దేవా చేశారు.
వైసీపీపై కూడా షర్మిల విమర్శలు గుప్పించారు. 2021లోనే కేంద్రం ప్రైవేటీకరణ ప్రకటన ఇచ్చినా జగన్ మౌనం వహించారని ఆమె గుర్తుచేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి న్యాయనిపుణుడు అని, ఆయన పేదలు, గిరిజనుల కోసం ఎన్నో తీర్పులు ఇచ్చారని షర్మిల చెప్పారు. తెలుగువాడికి మద్దతు ఇవ్వాల్సిన తెలుగు రాష్ట్ర సీఎం చంద్రబాబు మోడీకి మద్దతుగా నిలుస్తున్నాడని మండిపడ్డారు.