రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy Rains), వరదల (Floods) వల్ల ప్రభుత్వం (Government) సరైన ప్రణాళికలు, సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ (BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) (KTR) విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న బాధితులకు అండగా నిలబడాలని ఆయన బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ గురువారం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, జిల్లాలవారీగా వరదల వల్ల జరిగిన నష్టంపై ఆరా తీశారు.
జనజీవనం అస్తవ్యస్తంపై కేసీఆర్ ఆందోళన
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడడం, జనజీవనం అస్తవ్యస్తం కావడంపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వరదల వల్ల ఇళ్లు మునిగిపోవడం, రోడ్లు తెగిపోవడం వంటి అంశాలపై ఆయన దిగ్భ్రాంతి చెందారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలతో గురువారం ఫోన్‌లో మాట్లాడిన కేసీఆర్, తమ వంతుగా పార్టీ శ్రేణులు ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్‌కు ఆదేశించారు.