ఇదే రోజు, సరిగ్గా 25 ఏళ్ల కిందట.. అంటే 2000 సంవత్సరం ఆగస్టు 28న నేడు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుడిగా, విభజిత ఏపీ సీఎం(AP CM)గా ఉన్న నాటి చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu) పాలనలో హైదరాబాద్ (Hyderabad) నడిబొడ్డున, అసెంబ్లీకి కూతవేటు దూరంలో పోలీసుల తుపాకీ తూటాలకు ముగ్గురు నేలకొరిగారు. గుర్రాలతో, తుపాకులతో ఉద్యమాన్ని అణచివేయాలని భావించిన చంద్రబాబు రాజకీయ జీవితంలో ఈ ఘటన ఎప్పటికీ మాయని మచ్చ. అందుకే ఘటన జరిగి 25 ఏళ్లు గడిచినా ఇప్పటికీ బషీర్‌బాగ్ (Basheerbagh) దమనకాండ (Firing Incident) ఆయన్ను నీడలా వెంటాడుతూనే ఉంది.
ప్రపంచబ్యాంక్ (World Bank) షరతులకు తలొగ్గి ప్రైవేటీకరణ (Privatization) విధానాల అమలు, విద్యుత్‌రంగ సంస్కరణల్లో భాగంగా చంద్రబాబు సర్కార్ విద్యుత్‌చార్జీలు (Electricity Charges) పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. గణనీయంగా పెరిగిన గృహావసరాల కరెంట్ చార్జీలను తగ్గించాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వెల్లువెత్తినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. తొలుత సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఇతర వామపక్షాలు కలిసి రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాయి.
బషీర్ బాగ్‌లో రైతుల నెత్తుటి మరకకు నేటితో 25 ఏళ్లు!
— Telugu Feed (@Telugufeedsite) August 28, 2025
2000 ఆగస్టు 28న కరెంట్ చార్జీలు తగ్గించమని అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని అడిగితే రైతులను కాల్చి చంపిన బషీర్ బాగ్ ఘటనకు నేటితో 25 ఏళ్లు పూర్తి
ఈ ఘటనతోనే తెలంగాణ ఉద్యమం మరింత బలపడింది.. కేసీఆర్‌ను ఉద్యమం బాట పట్టించిన… pic.twitter.com/4LHUACre9n
నాడు కరెంట్ చార్జీల పెంపును నిరసిస్తూ నాలుగు నెలలుగా సాగిన ఆందోళనల సందర్భంలో 25 వేలకు పైబడి కేసులు నమోదయ్యాయి. మరోవైపు అప్పటి సీఎల్పీ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలోనూ విద్యుత్ చార్జీల ఉద్యమం ఉధృతమైంది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో 90 మంది ఎమ్మెల్యేలతో విపక్షనేత డాక్టర్ వైఎస్సార్ నిరవధిక నిరాహారదీక్షను మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కసారిగా షాక్ తగిలేలా చేశారు. విద్యుత్ చార్జీలను భారీగా పెంచి ప్రజలపై భారం మోపడాన్ని నిరసిస్తూ చంద్రబాబుకు నేటి తెలంగాణ మాజీ సీఎం, నాటి డిప్యూటీ స్పీకర్ కె.చంద్రశేఖరరావు లేఖ ద్వారా తమ అసంతృప్తిని తెలిపారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవికి, టీడీపీకి కేసీఆర్ రాజీనామా చేసి, మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టేందుకు, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటునకు విద్యుత్‌చార్జీల ఉద్యమం, కాల్పుల ఘటన పరోక్షంగా కారణమైంది.

ఆ రోజు ఏమైందంటే…
విద్యుత్ చార్జీల వ్యతిరేక ఉద్యమం తీవ్రమవుతున్న దశలోనే శాసనసభ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, ఆగస్టు 28న వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ విడివిడిగా ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చాయి. అడుగడుగునా పోలీసులు అడ్డంకులు కల్పించినా వేలాదిమంది కార్యకర్తలు ఇందిరాపార్కు ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి శాంతియుతంగా గుంపులు గుంపులుగా అసెంబ్లీ వైపు కదిలారు. ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో నిలువరించే ప్రయత్నం చేసినా వాటిని తోసుకుంటూ ప్రదర్శనగా బషీర్‌బాగ్ వైపు సాగారు. బషీర్‌బాగ్ చౌరస్తాలోని ఫ్లైఓవర్ కింద పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించారు. అశ్వదళాలు సైతం కదంతొక్కాయి. అక్కడకు కార్యకర్తలు చేరుకోకుండా పోలీసులు ఎక్కడికక్కడ లాఠీచార్జీలు, భాష్పవాయుగోళాలు ప్రయోగించి, గుర్రాలతో అడ్డుకునే చర్యలు తీవ్రం చేశారు. అయినప్పటికీ అసెంబ్లీ వైపునకు పరుగులు తీస్తున్న కార్యకర్తలపై చివరకు పోలీసు కాల్పులు జరపడంతో సత్తెనపల్లి రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డిలకు తుపాకీ గుళ్లు తగిలి అసువులు బాశారు. పోలీసుల తుపాకీ తూటాలు రైతుల గుండెల్లో దిగి బషీర్‌బాగ్ ప్రాంతమంతా రైతుల నెత్తుటితో తడిసిపోయింది.
