హైదరాబాద్ (Hyderabad) నగరంతో పాటు తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు (Torrential Rains) కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఆగని వర్షాల వలన రహదారులు(Roads) చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాకపోకలు దాదాపు స్తంభించిపోయాయి.
కామారెడ్డిలో ఆందోళనకరంగా..
కామారెడ్డి (Kamareddy) జిల్లాలో కురిసిన రికార్డు స్థాయి వర్షపాతం బీభత్సం సృష్టించింది. అర్గొండ స్టేషన్ (Argonda Station) వద్ద ఒక్కరోజులోనే 42 సెం.మీ వర్షపాతం నమోదై చరిత్ర సృష్టించింది. రహదారులు, గ్రామాలు నీటిలో మునిగిపోవడంతో వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా నీటిలో చిక్కుకోవడంతో ప్రజలను రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ పరిస్థితి అంతే భయానకంగా ఉంది. సర్ధానా, నాగపూర్, విశ్వనాథ్ పేట్, తాడ్వాయి, బికనూరు వంటి ప్రాంతాల్లో 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
అధికారులు అప్రమత్తం
రాష్ట్రవ్యాప్తంగా వర్ష పరిస్థితిని పరిశీలించేందుకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క, సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మదన్ మోహన్ నేడు ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. అధికారులు ప్రజలకు అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు. రాబోయే రెండు రోజుల్లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది.







