ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో జూ.ఎన్టీఆర్ (Jr. NTR), ఆయన ఫ్యాన్స్ (Fans)కు ఎదురవుతున్న చేదు అనుభవాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఏపీ(AP)లో ఎక్కడా ప్రెస్‌మీట్ (Press Meet) పెట్టనివ్వకపోవడంతో జూ.ఎన్టీఆర్ అభిమానులు తెలంగాణ (Telangana)లో ప్రెస్‌మీట్ పెట్టడం సంచలనంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే తీరుకు నిరసనగా ఎన్టీఆర్ అభిమానులు మొదట అనంతపురం, తరువాత విజయవాడ (Vijayawada)లో ప్రెస్‌మీట్ ప్లాన్ చేసినా.. అక్కడ కూడా అధికారులు, పోలీసులు అనుమతించలేదు. దీంతో చివరికి హైదరాబాద్ (Hyderabad)లోని ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇది ఏపీలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టంగా చూపుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ (Daggubati Prasad) జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన తల్లిని బూతులు తిట్టిన ఆడియో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కనీసం ప్రెస్‌మీట్ పెట్టే హక్కు కూడా లేకుండా చేయడం ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ అని అభిమాన సంఘాల నాయకులు మండిపడ్డారు.
అదే సమయంలో సినీ పరిశ్రమ నుంచి కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అత్యంత దారుణంగా బూతులు తిట్టినా, అదే ఇండస్ట్రీ నుంచి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సాధారణ అంశాలకే వెంటనే రియాక్ట్ అయ్యే పవన్, సహనటుడి తల్లిని అవమానించే వ్యాఖ్యలపై మాత్రం నిశ్శబ్దంగా ఉండడం ఎందుకని సినీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఎమ్మెల్యే ప్రసాద్ లోకేష్ అనుచరుడు కావడంతోనే అధికారపార్టీల నుంచి, ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని చర్చించుకుంటున్నారు.
హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టిన అభిమానులు టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. రెండు రోజుల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పకపోయినా, పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోయినా.. అందరూ అనంతపురం వెళ్లి భారీ నిరసన చేపడతామని హెచ్చరించారు. “కర్ర మీ చేతిలోనే ఉంది, పాము మీ చేతిలోనే ఉంది.. ఏం చేస్తారో చూద్దాం” అంటూ అభిమానులు సవాల్ విసిరారు. అవసరమైతే అభిమానులందరూ రాజకీయ రంగంలోకి వస్తారని కూడా స్పష్టం చేశారు.