హైదరాబాద్ (Hyderabad)కు చెందిన ప్రముఖ డీఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ (DSR Group Of Companies)లపై ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు సోదాలు చేపట్టారు. పన్ను చెల్లింపుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు అనుమానాలు రావడంతో ఐటీ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. నేడు ఉదయం నుంచి కంపెనీ కార్యాలయాలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
దాడులు జరుగుతున్న ప్రాంతాలు..
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్.ఆర్. నగర్, సురారం. ఐటీ అధికారులు దాడులు చేస్తున్న కంపెనీల్లో డీఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు దాని అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఈ సోదాలు ఏకకాలంలో దాదాపు 10 చోట్ల జరుగుతున్నాయి. దాడులు సజావుగా సాగేందుకు అధికారులు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు.
అధికారుల లక్ష్యం
గత ఐదు సంవత్సరాలుగా కంపెనీ పన్ను చెల్లింపుల రికార్డులపై ఐటీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సోదాల్లో భాగంగా, డీఎస్ఆర్ గ్రూప్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల తర్వాత మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.








