తెలంగాణ (Telangana)లో మార్వాడీ (Marwari) గో బ్యాక్ (Go Back) నినాదం విస్తృతంగా వినిపిస్తోంది. మార్వాడీలు రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు (Amanagallu)లో వ్యాపారులంతా (Traders) స్వచ్ఛందంగా 18న వాణిజ్య సముదాయాల మూసివేతకు పిలుపునిచ్చారు. మార్వాడీల అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) శనివారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. రాజగోపాల్‌రెడ్డి కామెంట్స్‌ను కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. ఇప్పటికే తాను ఆదేశాలు ఇచ్చానని, ముందుగా రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో మాట్లాడారో తెలుసుకుంటామని చెప్పారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ స్పష్టత
బీసీ రిజర్వేషన్ల (BC Reservations) విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. త్వరలోనే రిజర్వేషన్లపై పూర్తి స్పష్టత వస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
మార్వాడీలు మనలో ఒకరే
తాజాగా తెలంగాణలో “మార్వాడీ గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్” ప్రచారం మొదలైన నేపథ్యంలో మహేశ్ గౌడ్ స్పందించారు. మార్వాడీలు మనలో ఒకరని, వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. ఈ విషయంలో ఎవరికీ అనవసర భయాందోళన అవసరం లేదన్నారు.
ఈ అంశంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలో భాగంగా ఈ ప్రచారం తెరమీదకు తెచ్చారని విమర్శించారు. కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి డ్రామాలు చేస్తున్నారని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు.