ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న టీడీపీ (TDP) వర్సెస్ జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ (Jr. NTR Fans) వార్ ఇప్పుడు తారాస్థాయికి చేరిపోయింది. ఇందుకు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ట్వీట్ రూపంలో రాజేసిన అగ్గే కారణం అంటున్నారు సినీ, రాజకీయ విశ్లేషకులు. ఈనెల 14వ తేదీన రజనీకాంత్ (Rajinikanth) నటించిన కూలీ (Coolie) సినిమా రిలీజ్ కానుండగా, అదే రోజు యంగ్‌టైగర్ (Young Tiger) ఎన్టీఆర్(NTR) నటించిన వార్-2(War 2) సినిమా విడుదల కానుంది. అయితే మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలపడం వివాదానికి దారి తీసింది.
తన సహజ నటనతో తాతకు తగ్గ తనయుడిగా దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న నందమూరి తారక రామారావు (జూ. ఎన్టీఆర్), హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన వార్ 2 కూడా విడుదల కానుండటంతో, లోకేష్ ఈ ట్వీట్ ఉద్దేశపూర్వకమని, వార్ 2 ప్రభావాన్ని తగ్గించడానికే ఈ ప్రయత్నమని ఎన్టీఆర్ అభిమానులు ఆరోపిస్తున్నారు.
ఎన్టీఆర్ కౌంటర్..
నిన్న హైదరాబాద్ (Hyderabad)లో వార్ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈవెంట్ ప్రాంగణం మొత్తం జూ. ఎన్టీఆర్ అభిమానులతో నిండిపోయింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, “నా తాత నందమూరి తారక రామారావు ఆశీస్సులు నామీద ఉన్నంత కాలం, నన్ను ఎవ్వరూ ఆపలేరు” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు నేరుగా లోకేష్‌కు కౌంటర్‌గా ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఇండస్ట్రీలో తారక్‌ను అభిమానించేవారే అధికం. అతనికి శత్రువులంటూ ఎవరూ లేరు. ఇన్నాళ్లూ ఇలాంటి వ్యాఖ్యలు చేయని తారక్.. సడన్‌గా ఆ విషయాన్ని తన అభిమానుల సమక్షంలో మాట్లాడడంతో ఇది కచ్చితంగా మంత్రి లోకేష్‌కు కౌంటరే అంటున్నారు ఫ్యాన్స్.
ఎన్టీఆర్‌ను ఇటీవల కొన్ని శక్తులు తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నాయని, కానీ ఆయనను ఎవ్వరూ ఆపలేరని అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. “సొంతవాడి సినిమా కంటే పక్క రాష్ట్రం వ్యక్తి సినిమా లోకేష్‌కి ఎక్కువైపోయిందా?” అని ప్రశ్నిస్తూ, ఎన్టీఆర్‌కు మా ఫ్యాన్స్ సపోర్ట్ చాలని చెబుతున్నారు. లోకేష్ ట్వీట్ వల్ల నందమూరి వారసులు, నారా ఫ్యామిలీ మధ్య దూరం పెరుగుతోందని కూడా కొంతమంది విశ్లేషిస్తున్నారు.