ఏపీ సీఎం(AP CM) చంద్రబాబు (Chandrababu) తనయుడు, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ఘాటుగా స్పందించారు. నల్లగొండ (Nalgonda) క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy )తో కలిసి మాట్లాడారు. “లోకేష్ లాంటి చిన్నపిల్లల మాటలపై స్పందించనవసరం లేదు. పెద్దగా అవగాహన లేదు. ఆయన మాట్లాడినది పెద్దగా పట్టించుకోను. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రజల హక్కుల కోసం అవసరమైతే కేంద్రంతోనైనా పోరాడతాం. బనకచర్ల చాప్టర్ క్లోజ్. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడం ఖాయం” అని స్పష్టం చేశారు.
కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై..
“కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో అవినీతి జరిగిందని ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికే కొందరిపై చర్యలు తీసుకున్నాం. కమిషన్ నివేదిక ఆధారంగా కేబినెట్లో సమగ్రంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా అదే జరుగుతుంది. నా ఫోన్ నెంబర్ ఎన్నాళ్ల నుంచో అదే ఉంది, ఎవరైనా ట్యాప్ చేస్తే సరే” అని కోమటిరెడ్డి అన్నారు.
జిల్లా అభివృద్ధి ప్రాజెక్టులపై వివరాలు
“డిండి ప్రాజెక్టు టెండర్లు పూర్తయ్యాయి. నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టు కాలువలకు లైనింగ్‌ను ఒకే ఏడాది లోపల పూర్తిచేస్తాం. రైతు భరోసా పథకం కింద 100 ఎకరాలున్న వారికి కూడా లబ్ధి చేకూరింది. ఎంజీ యూనివర్శిటీలో కొత్త భవనాలు నిర్మిస్తాం. నార్కెట్‌పల్లి పెద్ద చెరువును వేణుగోపాల స్వామి పేరుతో మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తాం. క్యాంపు కార్యాలయాన్ని ఇందిరా భవన్‌గా పేరు పెడుతున్నాం” అని మంత్రి కోమటిరెడ్డి వివరించారు.
బీఆర్ఎస్పై విమర్శలు
బీఆర్ఎస్ పార్టీలో ఐదు గ్రూపులు నడుస్తున్నాయంటూ తీవ్ర విమర్శలు చేశారు. “కేసీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్, కేటీఆర్ – ఇలా ఐదు గ్రూపులు వేర్వేరుగా పార్టీని నడుపుతున్నాయి. బీసీలకు కవితకు సంబంధం ఏముంది? గత పదేళ్లలో ఒక్కసారి అయినా బీసీలు గుర్తొచ్చారా? బీఆర్ఎస్ అనే పార్టీ భవిష్యత్తులో ఉండదు. ఆ పార్టీ గురించి నేను మాట్లాడను” అని తేల్చేశారు.