సికింద్రాబాద్ (Secunderabad)లోని ప్రముఖ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ (Test Tube Baby Center)లో విషాదకర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సంతాన ఆశతో సదరు సెంటర్‌ను ఆశ్రయించిన ఓ వివాహితకు నిర్వాహకులు భారీ షాక్ ఇచ్చారు. దీంతో బాధిత దంపతులు పోలీసులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సంఘటన బాధిత దంపతులను తీవ్ర మనోవేదనకు గురి చేసింది.
వివరాల్లోకి వెళితే… గర్భధారణ సమస్యలు ఎదుర్కొంటున్న ఓ మహిళ, తన భర్త తో కలిసి సికింద్రాబాద్‌లోని “సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్” ను ఆశ్రయించింది. వైద్యురాలు తగిన పరీక్షలు నిర్వహించి, IVF చికిత్సను ప్రారంభించారు. అయితే, గర్భధారణ అనంతరం ఆ దంపతుల్లో అనుమానాలు తలెత్తాయి. ధ్రువీకరణ కోసం వారు డీఎన్‌ఏ(DNA) పరీక్ష చేయించారు.
ఆ పరీక్ష ఫలితాలు దంపతులను షాక్‌కు గురిచేశాయి. ఆమె కడుపులో ఉన్న శిశువు డీఎన్‌ఏ తన భర్తది కాదని, వేరే వ్యక్తికి సంబంధించినదని తేలింది. అంటే, భర్త (Husband) వీర్యకణాలతో (Sperm) కాకుండా, వేరే వ్యక్తి వీర్యకణాలతో శిశువు ఏర్పడిందన్న విషయంపై స్పష్టత వచ్చింది. దీంతో దిగ్బ్రాంతికి గురైన వారు పోలీసులను ఆశ్రయించి, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మానవ తప్పిదమా? లేక చావాలనే చేశారా అనే కోణాల్లో విచారణ సాగుతోంది. ఈ ఘటనతో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ల పనితీరుపై ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వైద్య నైతికతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారుల నుంచి కఠిన చర్యలకే సమయం ఆసన్నమైంది.








