ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వాతావరణాన్ని(Weather) మరోసారి తుపానుల (Cyclones) ప్రభావం కమ్మేసింది. బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం (Low Pressure) ఏర్పడనుండటంతో ఆగస్టు 4వ తేదీ వరకు వర్షాలు (Rains) కొనసాగనున్నట్లు భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) వెల్లడించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు పడే అవకాశముంది.
ఈ వర్షాల ప్రభావంతో ఉత్తర కోస్తా ప్రాంతాల్లో గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్రం అలజడి చెందే అవకాశంతో చేపల వేటపై తాత్కాలిక నిషేధం విధించారు. మత్స్యకారులు తీరానికి దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బుధవారం అల్లూరి, ఏలూరు, పల్నాడు, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా, అనకాపల్లి, కాకినాడ తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
గురువారం నాటికి శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉండనుంది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, నీటి మట్టాలు పెరిగే ప్రాంతాల్లో నివసించే వారు ముందస్తు చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు పరిస్థితి మెరుగయ్యే వరకు ఆగిపోవాలని సూచిస్తున్నారు.