జనసేన పార్టీ (Janasena Party) శ్రీకాళహస్తి (Srikalahasti) మాజీ ఇన్‌చార్జ్ (In-Charge) డ్రైవర్ హత్య (Driver Murder) కేసులో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. చెన్నై పోలీసుల అదుపులో ఉన్న జనసేన పార్టీ బహిష్కృత నేత వినుత కోట ఆమె భర్త చంద్రబాబు విచారణలో కీలక విషయాలను పోలీసులకు వెల్లడించారు. శ్రీకాళహస్తి (Srikalahasti) టీడీపీ(TDP) ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి (Bojjala Sudheer Reddy) తమ వ్యక్తిగత వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేశారని, ఈ విషయాన్ని జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు తెలియజేసినప్పటికీ, ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు. పవన్ నిర్లక్ష్య ధోరణే ఈ హత్యకు దారితీసిందని కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు అంగీకరించారు. ఈ కేసులో వినుత, చంద్రబాబుతో పాటు మరో ముగ్గురు నిందితులను చెన్నై సెవెన్ వెల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వినుత దంపతుల వాంగ్మూలం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
వినుత దంపతులు తమ వాంగ్మూలంలో బొజ్జల సుధీర్ రెడ్డి రహస్య కెమెరాల ద్వారా తమ బెడ్‌రూమ్ వీడియోలను రికార్డు చేయించారని, ఈ వీడియోలను డ్రైవర్ శ్రీనివాసులు(Srinivasulu) అలియాస్ రాయుడు (Rayudu) రూ. 30 లక్షలకు ఎమ్మెల్యేకు విక్రయించారని వెల్లడించారు. ఈ వీడియోలతో సుధీర్ తమను బ్లాక్‌మెయిల్ చేయించారని, ఈ విషయాన్ని పవన్ కల్యాణ్‌కు తెలియజేసినప్పుడు, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి సమస్యను సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే, పవన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సుధీర్ బ్లాక్‌మెయిలింగ్ కొనసాగించారని, దీంతో తమ రాజకీయ జీవితం నాశనమైందని వినుత ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ బాధ్యతాయుతంగా స్పందించి ఉంటే శ్రీనివాసులు హత్య జరిగేది కాదన్నారు.
డ్రైవర్ రాయుడును పని నుంచి తొలగించిన తర్వాత, వినుత దంపతులు అతన్ని పిలిపించి బ్లాక్‌మెయిలింగ్ విషయంపై నిలదీశారు. శ్రీనివాసులు సుధీర్ రెడ్డికి వీడియోలను రూ. 30 లక్షలకు విక్రయించినట్లు, అందులో రూ. 20 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించాడని వారు తెలిపారు. ఈ చర్చ ఘర్షణకు దారితీసి, ఆ సందర్భంలోనే రాయుడు హతమయ్యాడని వినుత దంపతులు చెన్నై పోలీసులకు తెలిపారు. పవన్ కల్యాణ్ సరైన సమయంలో జోక్యం చేసుకొని ఎమ్మెల్యే సుధీర్‌ను అడ్డుకుని ఉంటే ఈ దుర్ఘటన నివారించబడేదని, తాము హత్య కేసులో చిక్కుకోవాల్సి రాకుండా ఉండేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన టీడీపీ-జనసేన కూటమిలో రాజకీయ విభేదాలను బహిర్గతం చేస్తున్నాయి.
పోలీసుల విచారణలో జనసేన మాజీ నేతలు వెల్లడించిన విషయాలు పార్టీ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వినుత దంపతులు తమ ఆవేదనను పవన్ కల్యాణ్‌కు తెలియజేసినప్పటికీ, ఆయన పట్టించుకోకపోవడం వల్ల తమ రాజకీయ జీవితం నాశనమైందని ఆరోపించారు. అయితే ఇన్‌చార్జ్ హోదాలో ఉన్నవారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్య జనసేన కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందనేది బిగ్ క్వశ్చన్. డ్రైవర్ రాయుడు హత్య కేసు దర్యాప్తును చెన్నై పోలీసులు ముమ్మరం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జనసేన నాయకత్వం ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. విచారణలో వినుత కోట దంపతులు అంగీకరించిన విషయాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.