ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉంది హీరోయిన్ రష్మిక మందన్నా. ‘యానిమల్’, ‘పుష్ప 2’, ‘ఛావా’ వంటి చిత్రాలతో సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ‘కుబేర’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న ఈ అమ్మడు తాజాగా మరో కొత్త సినిమాను అనౌన్స్ చేసింది.
పాన్ ఇండియా స్థాయిలో ‘మైసా’
నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె, తెలుగు, హిందీ భాషలలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవల విడుదలైన ‘పుష్ప 2’, ‘ఛావా’, ‘సికందర్’ సినిమాలతో మెప్పించిన రష్మిక, ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రలలో నటించిన ‘కుబేర’ సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. ఈ చిత్రంలో తనదైన నటనతో రష్మిక ప్రశంసలు దక్కించుకుంది. మరోవైపు ‘గర్ల్ ఫ్రెండ్’, ‘రెయిన్’ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ కొన్ని నెలలుగా జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే గురువారం తన కొత్త సినిమాను ప్రకటించి, ఈ మూవీలో తాను సరికొత్తగా కనిపించనున్నట్లు ముందుగానే తెలియజేసింది. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. రష్మిక మందన్న నటిస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్ టైటిల్ “మైసా”. రవీంద్ర పూలే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను ఐదు భాషలలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.
పోస్టర్‌తో ఆసక్తి రేపిన రష్మిక లుక్
తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్‌లో రష్మిక భయంకరమైన అవతారంలో కనిపించి మరింత ఆసక్తిని పెంచింది. ఈ చిత్రాన్ని అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. “ధైర్యం ఆమె బలం. సంకల్పంలో లేదు కనికరం.. ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి.. !” అంటూ నిర్మాణ సంస్థ షేర్ చేసిన పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని కలిగిస్తుంది. ఇందులో రష్మిక ఒక వారియర్ పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్ చూస్తుంటే స్పష్టమవుతోంది.
“ఇది ఆరంభం మాత్రమే” – రష్మిక
తన కొత్త సినిమాపై రష్మిక స్పందిస్తూ.. “నేనెప్పుడూ కొత్తది, భిన్నమైనది, ఉత్తేజకరమైన సినిమాలకు ప్రాధాన్యమిస్తాను. ‘మైసా’ లాంటి సినిమా ఒకటి. నేను ఇంతకు ముందెప్పుడూ పోషించని పాత్ర. ఎప్పుడూ అడుగుపెట్టని ప్రపంచం ఇది. ఇప్పటివరకు చేయని వెర్షన్. ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే” అంటూ రాసుకొచ్చింది. రష్మిక కెరీర్‌లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.








