ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. జ్యూస్ ఫ్యాక్టరీల ముందు మామిడి లోడ్లతో ట్రాక్టర్లు కిలోమీటర్ల మేర వరుసలో నిలిచి, రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. టోటపూరి మామిడి కిలో రూ. 8కి కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ఈ ఆదేశాలు ఆచరణలో అమలుకాక, జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు కిలో రూ. 2 నుంచి రూ. 3కే మామిడి కొనుగోలు తమ శ్రమను దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశాలను సైతం ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఖాతరు చేయకపోవడం గమనార్హం.
రైతుల ఆవేదన.. ఫ్యాక్టరీల దోపిడీ
జిల్లాలోని 43 జ్యూస్ ఫ్యాక్టరీలలో 34 మాత్రమే ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి, అయితే ఈ ఫ్యాక్టరీలు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) రూ. 12 (రూ. 8 ఫ్యాక్టరీలు, రూ. 4 సబ్సిడీగా) కంటే చాలా తక్కువ ధరలకు మామిడిని కొనుగోలు చేస్తున్నాయి. కొన్ని ఫ్యాక్టరీలు రూ. 5–6 రూపాయలు, మరికొన్ని రూ. 3–4 రూపాయలకే కొనుగోలు చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది 2.75 లక్షల టన్నుల మామిడి పల్ప్ ఎగుమతి కాకపోవడం, అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, మరియు కర్ణాటక, తమిళనాడు నుంచి తక్కువ ధరలకు వచ్చే మామిడి దిగుమతుల వల్ల ఈ సంక్షోభం తీవ్రమైందని ఫ్యాక్టరీ యాజమాన్యాలు వాదిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో, రైతులు తమ పంటను అమ్మక తప్పని స్థితిలో రోడ్లపై మామిడిని పారవేస్తూ నిరసనలు చేపడుతున్నారు.
ప్రభుత్వ చర్యలు.. సవాళ్లు
చిత్తూరు జిల్లా కలెక్టర్, హార్టికల్చర్ డైరెక్టర్ జ్యూస్ ఫ్యాక్టరీలను పరిశీలించి, MSPని కఠినంగా అమలు చేయాలని ఆదేశించినప్పటికీ, ఫ్యాక్టరీలు ఈ నిబంధనలను పాటించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మామిడి రైతులకు జరుగుతున్న అన్యాయాలను పట్టించుకోవడం లేదని, కిలోమీటర్ల మేర వేచి ఉండి రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘాలు MSP కఠినంగా అమలు చేయాలని, మధ్యవర్తులను తొలగించాలని, వాతావరణ, కీటకాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాయి.