ఈశాన్య (Northeast) భారతదేశంలోని పలు రాష్ట్రాలను వరదలు (Floods) ముంచెత్తుతున్నాయి. మే 29 నుండి కురుస్తున్న భారీ వర్షాలు (Heavy Rains), వరదల (Floods) కారణంగా ఇప్పటివరకు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఈ విపత్తు తీవ్ర ప్రభావం చూపింది.
వరదల ప్రభావం
ఈ వర్షాల కారణంగా గ్రామాలు, పట్టణాలను ముంచెత్తడమే కాక, పంటలు, రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. స్థానిక అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి, ఆహారం, మెడిసిన్ అందిస్తోంది. భారీ వర్షాల వల్ల అస్సాంలో 17 మంది, అరుణాచల్ ప్రదేశ్‌లో 12 మంది, మేఘాలయలో 6 మంది, మిజోరంలో 5గురు, త్రిపురలో ఇద్దరు, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
వాతావరణ హెచ్చరిక
భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక ప్రకారం.. ఈశాన్య రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. నిరాశ్రయులకు తాత్కాలిక ఆశ్రయం, ఆహారం అందిస్తున్నారు. వరదల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రజలు స్థానిక అధికారుల సూచనలను పాటించి, సురక్షితంగా ఉండాలని కోరుతున్నాము. వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండటం అవసరం అని అధికారులు సూచిస్తున్నారు.