విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో జరిగిన దుర్ఘటనపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులపై గోడ కుప్పకూలి ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై వైఎస్ జగన్ స్పందించారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు.
ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన జగన్, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన భక్తులకు తక్షణం మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను సూచించారు. మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. భక్తుల భద్రతకు సంబంధించి ఆలయ నిర్వాహకులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గత కొన్ని నెలలుగా..
కాగా, గత కొన్ని నెలలుగా వరుసగా ఆలయాల్లో అపశృతులు చోటుచేసుకుంటుండడం భక్తులకు ఆగ్రహం తెప్పిస్తోంది. వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం తిరుమలలో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోవడం, గోవుల మృతి, ఆశీనాయన ఆశ్రమం కూల్చివేత, తాజాగా అప్పన్నస్వామి ఆలయంలో గోడ కూలి భక్తులు చనిపోవడం భక్తులను భయాందోళనలు కలిగిస్తున్నాయి. గతంలో తొక్కిసలాటలు, గోడ కూలి భక్తులు చనిపోయిన సందర్భాలు ఎప్పుడూ లేవని భక్తులు అంటున్నారు.