రియ‌ల్ కాదు.. రీల్స్ మంత్రి

రియ‌ల్ కాదు.. రీల్స్ మంత్రి

ఉత్త‌రాంధ్ర (Uttarandhra) నుంచి ఒక ఎంపీ (MP) కేంద్ర కేబినెట్‌ (Central Cabinet) లో మంత్రిగా ఉన్నారంటే రాష్ట్రంతో పాటు, ఆ ప్రాంతం కూడా సంతోషించ‌ద‌గ్గ‌దే. కాక‌పోతే ఆ సంతోషం ప‌ద‌వి పొందిన‌వారి ముఖంలో త‌ప్ప‌, రాష్ట్ర ప్ర‌జ‌ల ముఖంలోనూ, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ముఖంలోనూ క‌నిపించ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్‌నాయుడి (Ram Mohan Naidu) ప‌నితీరు అత్యంత ఘోరంగా ఉంద‌నేది ఇటీవ‌లి ప‌రిణామాలే వెల్ల‌డిస్తున్నాయి. కేంద్ర‌మంత్రిగా ఉన్న బాధ్య‌త‌ల్లో క‌న్నా నారా లోకేశ్‌ (Nara Lokesh)కు స‌న్నిహితుడిగా ఉండేందుకే రామ్మోహ‌న్ నాయుడు నిరంత‌రం ప‌రిత‌పిస్తున్నార‌ట‌. బ‌హుశా ఈ సావాసం వ‌ల్లేనేమో లోకేశ్‌, చంద్ర‌బాబు (Chandrababu) కంటే మ‌రింత ప్ర‌చార ఆర్భాటాల‌కు (Media Stunts) అల‌వాటు ప‌డిపోయార‌ని ప‌లువురి విశ్లేష‌ణ‌.

3సార్లు ఎంపీగా ప‌నితీరు శూన్యం..
ఎంపీగా 2009 నుంచి మూడు ద‌ఫాలుగా శ్రీ‌కాకుళం (Srikakulam) నుంచి ఎంపీగా గెలిచిన రామ్మోహ‌న్ నాయుడు ఉత్త‌రాంధ్ర ప్రాంతంపై వేసిన అభివృద్ధి ముద్ర శూన్యం. త‌న తండ్రి ఎంపీగా ఢిల్లీలో ప‌దేళ్లు ఉన్న‌ప్పుడు అనివార్యంగా అక్క‌డే విద్య‌ను అభ్య‌సించిన రామ్మోహ‌న్ నాయుడుకు స‌హ‌జంగానే ఇంగ్లిషు, హిందీ భాష‌ల‌పై ప‌ట్టువ‌చ్చింది. అన‌ర్గ‌ళంగా మాట్లాడేందుకు తాను నేర్చుకున్న భాష‌లు మ‌రింత సౌక‌ర్యాన్ని, సొబ‌గుల‌నూ అద్దాయి. కాక‌పోతే 3సార్లు ఎంపీగా ఉన్న‌ప్ప‌టికీ ఆ మాట‌ల మూట‌లు త‌ప్ప‌, త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా ఒక ప్రాజెక్టును కాని, ఒక ప‌నిగాని సాధించ‌లేక‌పోయారు. చంద్ర‌బాబు, లోకేశ్‌ల మ‌ద్ద‌తుదారుడిగా ఉన్నారు త‌ప్ప ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ప్ర‌తినిధిగా నిల‌వ‌లేక‌పోతున్నార‌ని ఆ ప్రాంత ప్ర‌జ‌ల అభిప్రాయం.

విశాఖ‌లో వారి దోపిడీకి వార‌ధి..
రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ ఆర్థికంగా శ‌క్తివంత‌మైన న‌గ‌రాల్లో విశాఖ‌ప‌ట్నం (Visakhapatnam) ఒక‌టి. భౌగోళికంగా ఉండే సానుకూల‌త‌లు, బ్రిటిష్‌కాలం నుంచీ వాణిజ్యానికి కేంద్రంగా ఉండ‌డం విశాఖ‌కు అద‌న‌పు బ‌లం. విర‌విగా కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల కార‌ణంగా గ్లోబ‌ల్‌గా న‌గ‌రానికి ఎప్ప‌టినుంచో గుర్తింపు ఉంది. కానీ, ఈ న‌గ‌రం ఆర్థిక ఎదుగుద‌ల ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఎంత‌వ‌ర‌కూ ఉప‌యోగ‌ప‌డింద‌నేది ఎప్పుడూ న‌డిచే చ‌ర్చ‌. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఒక్క వైఎస్సార్‌, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ప‌రిపాల‌న స‌మ‌యంలోనే ప్ర‌జ‌లు వారికి మ‌ద్ద‌తు ఇచ్చారు. మిగిలిన స‌మ‌యం అంటే దాదాపుగా 30 ఏళ్లు టీడీపీ అధికారానికి మ‌ద్ద‌తు ప‌లికారు. ముఖ్యంగా సంస్క‌ర‌ణ‌ల‌తో ఉదార‌వాద ఆర్థిక విధానాలు వ‌చ్చాక‌, ప్రైవేట్ రంగానికి ప్ర‌భుత్వం బార్లా తెరిచిన 1994-2004 మ‌ధ్యకాలంలో విశాఖ న‌గ‌రంలో టీడీపీ అనుకూల శ‌క్తులు పాగా వేశాయి. అన్ని కాంట్రాక్టులు, అన్ని పారిశ్రామిక వాడ‌లు, స‌ప్లై చైన్‌, ఉత్ప‌త్తి కేంద్రాలు, విద్య‌, వైద్యం, ఆరోగ్య రంగాల‌న్నీ వారి చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు P4 అంటున్న చంద్ర‌బాబు ఆ రోజుల్లో P3 అంటే ప‌బ్లిక్‌, ప్రైవేట్ పాట్న‌ర్‌షిప్ ప‌ద్ధ‌తిలో విలువైన ఆస్తుల‌ను, భూముల‌ను అనుకూల శ‌క్తుల‌కు క‌ట్ట‌బెట్టారు. దీన్నొక అభివృద్ధిగా చూపించే ప్ర‌య‌త్నం వారి మీడియా సంస్థ‌ల‌తో ముమ్మ‌రంగా జ‌రిగింది. ఇలాంటి సంద‌ర్భాల్లో టీడీపీ తంత్రాన్ని భుజానికెత్తుకుని ఆ పార్టీ ఉత్త‌రాంధ్ర నాయ‌కులంతా ప‌నిచేశారు. అంతేగాని ఉత్త‌రాంధ్ర ప్రాంతానికి జ‌రుగుతున్న అన్యాయాన్ని ఏరోజూ ప్ర‌శ్నించలేక‌పోయారు. మొద‌ట్లో ఎర్ర‌నాయుడు (Errannaidu) బాబును భుజానికెత్తుకుంటే.. ఇప్పుడు చంద్ర‌బాబు, లోకేశ్‌ను రామ్మోహ‌న్ నాయుడు భుజాన‌కెత్తుకుంటున్నారు. ఎక‌రం భూమి 99 పైస‌ల‌కు ఇటీవ‌ల ఒక ప‌రిశ్ర‌మ‌కు అప్ప‌గించ‌డంపై చ‌ర్చ జోరుగా సాగుతున్న నేప‌థ్యంలో ఉత్త‌రాంధ్ర టీడీపీ లీడ‌ర్ల ప‌నితీరు, ప్ర‌భావంపైన కూడా చ‌ర్చ లోతుగా జ‌రుగుతుంది.

భోగాపురంలో స్టంట్స్‌..
కేంద్ర పౌర విమాన‌యాన మంత్రి (Union Minister of Civil Aviation)గా ఉన్న రామ్మోహ‌న్ నాయుడు ఢిల్లీ నుంచి విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులో దిగి శ్రీ‌కాకుళం వెళ్తారు. మార్గ‌మ‌ధ్య‌లో భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం (Bhogapuram International Airport) ఉంది. విశాఖ‌ నుంచి శ్రీ‌కాకుళం వెళ్లేట‌ప్పుడు, అటు నుంచి వ‌చ్చేట‌ప్పుడు భోగాపురం విమానాశ్ర‌యాన్ని సంద‌ర్శించ‌డం, ప‌దుల కొద్దీ జ‌ర్న‌లిస్టుల‌ను వెంట‌పెట్టుకుని మీడియా స్టంట్లు చేయ‌డం ఒక అల‌వాటుగా మారింది. భోగాపురం నిర్మాణంలో ఉన్న వివిధ ప్రైవేటు కంపెనీల అధికారులు, సిబ్బంది దీన్ని భ‌రించ‌డం వారికి క‌ష్టంగా మారింది. అస‌లు ఆ విమానాశ్ర‌యం ఇన్నేళ్లు ఆగిపోవ‌డ‌నికి చంద్ర‌బాబే కార‌ణ‌మ‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. 2014-19 మ‌ధ్య పౌర విమానాయాన శాఖ టీడీపీ వ‌ద్ద ఉన్న‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వంలో భాగ‌స్వాములుగా ఉన్న‌ప్ప‌టికీ కూడా ఏమీ చేయ‌లేక‌పోయారు. భూసేక‌ర‌ణ‌లో, ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు తీసుకురావ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. వైఎస్ జ‌గ‌న్ (Y.S. Jagan) పరిపాల‌న‌లో అన్నీ క్లియ‌ర్ అయ్యి మ‌ళ్లీ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. ఇప్పుడు కూడా పౌర విమానాయాన శాఖ‌మంత్రి ప‌ద‌వి టీడీపీ వ‌ద్దే ఉంది. రామ్మోహ‌న్ నాయుడే దీనికి మంత్రి. కానీ, రాష్ట్రంలోనే అతిపెద్ద న‌గ‌ర‌మైన విశాఖ‌కు రాను రాను విమానాలు త‌గ్గిపోతున్నాయి. అంత‌ర్జాతీయ‌, దేశీయ స‌ర్వీసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ఇవ‌న్నీ టీడీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాకే.. అది కూడా రామ్మోహ‌న్ నాయుడు హ‌యాంలోనే జ‌రుగుతుంది.

విశాఖ విమానాశ్ర‌యం వెల‌వెల‌..
విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టు (Visakhapatnam Airport) నుంచి ఐదు అంత‌ర్జాతీయ స‌ర్వీసులు కొన‌సాగుతుండ‌గా, క‌రోనా కార‌ణంగా అవి నిలిచిపోయాయి. వైర‌స్ త‌గ్గుముఖం ప‌ట్టిన త‌రువాత సింగ‌పూర్‌, మ‌లేష‌యా స‌ర్వీసులను పున‌రుద్ధ‌రించారు. ఇటీవ‌ల దుబాయ్ (Dubai) నుంచి కూడా విమానం తెప్పిస్తాన‌ని రామ్మోహ‌న్ నాయుడు హామీ ఇచ్చారు. ఇంత‌లో ఉన్న మూడు స‌ర్వీసుల్లో రెండు అంత‌ర్జాతీయ స‌ర్వీసులు (బ్యాంకాక్‌, మ‌లేషియా) మే 1వ తేదీ నుంచి నిలిచిపోయాయి. ఇక‌ విశాఖకు విమానాశ్రయానికి మిగిలిన‌ ఏకైక అంతర్జాతీయ స‌ర్వీస్ సింగ‌పూర్ మాత్ర‌మే. ఇదిలా ఉండ‌గా, విశాఖ నుంచి విజ‌య‌వాడ (గ‌న్న‌వ‌రం)కు ప్ర‌తిరోజూ రెండు ఇండిగో ఎయిర్‌లైన్స్ స‌ర్వీసులు ఉండ‌గా, అవి కూడా ఈనెల 1వ తేదీ నుంచి నిలిచిపోవ‌డం గ‌మ‌నార్హం. విశాఖ నుంచి గోవా, ముంబై, భువ‌నేశ్వ‌ర్ వెళ్లే విమానాలు కూడా ర‌ద్దు అయ్యాయి. విశాఖ నుంచి హైద‌రాబాద్ మీదుగా దుబాయ్ వెళ్లే స‌ర్వీసును కూడా ర‌ద్దు చేశారు. రాత్రి స‌మ‌యాల్లో ఫైట్ స‌ర్వీసులు ఎత్తివేశారు. విశాఖ‌కు ఇన్ని స‌ర్వీసులు ర‌ద్దు అవుతుంటే ఉత్త‌రాంధ్ర వాసిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హోదాలో ఉన్న రామ్మోహ‌న్‌నాయుడు స్పందించ‌క‌పోవ‌డం విడ్డూరం. ఆక్యుపెన్సీ ఆధారంగానే స‌ర్వీసులు ర‌ద్దు అవుతున్నా.. విజ‌య‌వాడ‌కు ఇస్తున్న ప్ర‌యారిటీ.. గ్లోబ‌ల్ న‌గ‌రంగా పేరున్న విశాఖ‌కు ఇవ్వ‌క‌పోవ‌డం ఏపీ ప్ర‌జ‌లు ఆలోచించద‌గ్గ విష‌యం.

Join WhatsApp

Join Now

Leave a Comment