ఎవరెస్టు (Everest) అధిరోహించడం అనేది అత్యంత క్లిష్టమైన సాహసం. కఠినమైన వాతావరణ పరిస్థితులు, చుట్టూ మంచు, ఎత్తైన పర్వత మార్గాలు.. ఇవన్నీ కూడా ఒక సాధారణ వ్యక్తి సాధించలేనివిగా కనిపిస్తాయి. కానీ కేరళకు చెందిన 59 ఏళ్ల వసంతి చెరువువీట్టిల్ (Vasanthi Cheruvuveettil) ప్రత్యేక శిక్షణ లేకుండానే ఈ ఘనత సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
యూట్యూబ్ వీడియోలే ఆమెకు మార్గదర్శకం
కన్నూర్ జిల్లా తాలిప్పరంబాకు చెందిన వసంతి చిన్నప్పటి నుంచి ఎవరెస్టును అధిరోహించాలని కలలు కనేది. అయితే, ఆమెకు ప్రత్యేక శిక్షణ లేకపోవడంతో యూట్యూబ్ వీడియోలను ఆధారంగా తీసుకుని స్వయంగా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. రోజుకు 3-4 గంటలు ట్రెక్కింగ్ బూట్లు వేసుకుని ఐదారు కిలోమీటర్లు నడుస్తూ తన శరీరాన్ని అందుకు అలవాటు చేసుకుంది. అదనంగా, భాషా సమస్యలు ఎదురుకాకుండా హిందీ నేర్చుకుంది.
ఎవరెస్టు బేస్ క్యాంప్‌లో భారత జెండా
ఫిబ్రవరి 15న నేపాల్‌లోని సుర్కే నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన వసంతి, ఫిబ్రవరి 23న ఎవరెస్టు దక్షిణ బేస్ క్యాంప్‌కు చేరుకుంది. ట్రెక్కింగ్ సమయంలో జర్మన్ జంటతో పాటు తిరువనంతపురం నుంచి వచ్చిన తండ్రీకొడుకులు ఆమెకు సహాయం చేశారు. అనేక క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె వెనుకడుగు వేయలేదు.
బేస్ క్యాంప్ చేరుకున్న తర్వాత వసంతి కేరళ సాంప్రదాయ చీరలో భారత జెండాను ఊపుతూ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది క్షణాల్లో వైరల్‌గా మారి ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.