కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగరలో మూడో తరగతి విద్యార్థిని తేజస్విని (8) గుండెపోటుతో మరణించటం తీవ్ర సంచలనం రేపింది. స్థానికంగా పేరొందిన సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో చదువుతున్న తేజస్విని సోమవారం ఉదయం ఎంతో ఉత్సాహంగా పాఠశాలకు వచ్చిందని ఉపాధ్యాయులు తెలిపారు.
స్నేహితులతో ముచ్చటించుకుంటూ ఉండగా ఆమె ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. ఈ పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, మార్గమధ్యంలోనే చిన్నారి తుది శ్వాస విడిచింది. గుండెపోటు కారణంగానే తేజస్విని మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.
ఆందోళన కలిగించిన ఘటన
ఈ ఘటన స్థానికంగా మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల హృదయాలను కలచివేసింది. చిన్న వయస్సులో గుండెపోటు రావడం ఆందోళనకర పరిణామంగా భావిస్తున్నారు. తేజస్విని కుటుంబానికి పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.