ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలు మహిళా రక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మదనపల్లి ఘటన మరువకముందే.. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా పేరుగాంచిన విశాఖలో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఘటన సంచలనంగా మారింది.
విశాఖపట్నంలోని న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. స్థానికంగా నివసించే ఎరిపిల్లి యోగి అలియాస్ గాంధీ అనే వ్యక్తి, చిన్నారికి బిస్కెట్లు, తినుబండారాలు కొని పెడతానని చెప్పి తీసుకెళ్లి దారుణ అఘాయిత్యానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అయితే, చిన్నారిని తిరిగి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆమె తీవ్రంగా ఏడవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రక్తస్రావం గమనించిన తల్లి వెంటనే చుట్టుపక్కల వారికి సమాచారం అందజేసింది. స్థానికుల సహకారంతో నిందితుడిపై న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక, బాలికను కేజీహెచ్ కు తరలించి చికిత్స అందజేస్తున్నారు.








