ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 27 మంది ప్రయాణికులతో భీమ్‌టాల్ నుండి హల్ద్వానీకి వెళ్తున్న బస్సు అదుపుతప్పి 1500 అడుగుల లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పదిమంది తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నైనిటాల్ జిల్లా అమ్దాలి సమీపంలో బస్సు అదుపు తప్పడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. సంఘటనా స్థలానికి ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ బృందాలు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. స్థానికుల సహకారంతో రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నాయి. రెస్క్య్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.
ముఖ్యమంత్రితో పాటు ప్రజల ఆవేదన
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. స్థానిక అధికారులను తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.