ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73) అనారోగ్యంతో కన్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన హఠాన్మరణం చెందారు. జాకీర్ హుస్సేన్ మరణవార్త సంగీత ప్రపంచాన్ని, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ముంబైలో పుట్టిన జాకీర్ హుస్సేన్ తన కళతో పద్మశ్రీ, పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు.
జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. ఆయన తండ్రి ఉస్తాద్ అల్లా రఖా దేశంలోని ప్రముఖ పెర్కషన్ కళాకారుడు. చిన్నతనం నుంచే తబలా పట్ల ఆసక్తి పెంచుకున్న జాకీర్, తన తండ్రి నుండి ప్రాథమిక శిక్షణ తీసుకున్నారు. 11వ ఏట సంగీత ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, అద్భుతమైన నైపుణ్యంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.
సంగీతంలో చేసిన విశేష కృషికి గాను పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులను పొందిన జాకీర్ హుస్సేన్, బాలీవుడ్ సంగీతానికి కూడా తనదైన ముద్ర వేశారు. వివిధ అంతర్జాతీయ కళాకారులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానులను సంపాదించుకున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా గుండె సంబంధిత వ్యాధి, రక్తపోటు సమస్యలతో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు అత్యుత్తమ వైద్యం అందించినా, ఆయన ప్రాణాలు నిలుపుకోలేకపోయారు. జాకీర్ హుస్సేన్ మృతితో భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచం ఓ అపూర్వ కళాకారుడిని కోల్పోయింది.