వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన తల్లి యర్రం పిచ్చమ్మ (84) ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆమె ఒంగోలు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.
పిచ్చమ్మ పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, బంధువుల సందర్శనార్థం వైవీ సుబ్బారెడ్డి నివాసంలో ఉంచనున్నారు. అంతిమ సంస్కారాలను మంగళవారం వైవీ సుబ్బారెడ్డి స్వగ్రామమైన మేదరమెట్లలో నిర్వహించనున్నారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయమ్మ, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సహా పలువురు వైసీపీ నేతలు పిచ్చమ్మ అంత్యక్రియల్లో పాల్గొననున్నట్లు సమాచారం.