వైసీపీ కార్య‌క‌ర్త హ‌త్య‌.. ప‌ల్నాడు జిల్లాలో దారుణం (Video)

వైసీపీ కార్య‌క‌ర్త హ‌త్య‌.. ప‌ల్నాడు జిల్లాలో దారుణం

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్త మందా సల్మాన్‌పై తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు మోటమర్రి పేతురు కర్రలు, ఇనుపరాడ్డుతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

వివరాల ప్రకారం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నాయకుల బెదిరింపులతో వైసీపీ కార్య‌క‌ర్త మందా సల్మాన్ గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఇటీవల తన కుటుంబ సభ్యులకు అనారోగ్య స‌మ‌స్య ఉంద‌ని, ప‌ల‌క‌రించి వెళ్లేందుకు పిన్నెల్లి గ్రామానికి వచ్చాడు. ఈ సమయంలో దారుణ‌ ఘటన జరిగింది. “నీకు ఎంత ధైర్యం ఉంటే మా ప్రభుత్వం ఉండ‌గా గ్రామంలో అడుగుపెడ‌తావ్‌” అంటూ దూషిస్తూ, తెలుగుదేశం నాయకుడు మోటమర్రి పేతురు సల్మాన్‌పై ఇనుప రాడ్డు, క‌ర్ర‌ల‌తో దాడి చేశాడ‌ని కుటుంబ స‌భ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

దాడిలో తీవ్రంగా గాయపడిన సల్మాన్‌ను తొలుత స్థానికంగా చికిత్స అందించి, ఆపై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఈ దాడిని రాజకీయ కక్షసాధింపు చర్యగా వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌జ‌ల‌కు, ముఖ్యంగా వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని ఆ పార్టీ శ్రేణులు చంద్ర‌బాబు స‌ర్కార్‌పై ఫైర‌వుతున్నారు. ఘటనపై పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment