ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘సూపర్ సిక్స్ (Super Six)’ పథకాన్ని ‘సూపర్ ఫ్లాప్ (Super Flop)’ అని అభివర్ణిస్తూ, దానిని ‘సూపర్ హిట్’ అని చెప్పడం హాస్యాస్పదమని ట్వీట్ చేశారు.
“సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు. హామీలు అమలు చేసిన తర్వాతే విజయ సభలు జరపాలి. ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాలేదు” అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి, కొత్త ఉద్యోగాల సృష్టి, మహిళలకు నెలకు 15 వందల ఆర్థిక సహాయం వంటి హామీలన్నీ కేవలం మాటలుగానే మిగిలిపోయాయని షర్మిల ఎద్దేవా చేశారు.
రైతుల పథకాల విషయానికొస్తే, అన్నదాత సుఖీభవలో సొంతంగా 20 వేలు ఇస్తామని చెప్పి, కేంద్రం ఇచ్చే 6 వేల రూపాయలతో లింక్ పెట్టారని విమర్శించారు. కేవలం కొంతమందికి ఒక విడత సహాయం చేసి, లక్షలాది మంది రైతులను పథకం నుంచి బయటపెట్టారని ఆరోపించారు.
తల్లికి వందనం పథకం కింద కూడా 87 లక్షల మంది పిల్లలలో కేవలం 67 లక్షల మందికి మాత్రమే లబ్ధి అందించారని, మిగతా 20 లక్షల మందిని మోసం చేశారని తెలిపారు. మూడు సిలిండర్లు ఎన్ని ఇస్తున్నారో స్పష్టత లేదని, 14 నెలల తర్వాత ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి సూపర్ హిట్ అని చెప్పుకోవడం ప్రజల్ని నవ్విస్తోందని షర్మిల సెటైర్లు వేశారు.
అంతేకాదు, కూటమి ఇచ్చిన మిగతా హామీలు కూడా మోసమేనని షర్మిల ఆరోపించారు. జనవరి జాబ్ క్యాలెండర్, పెన్షన్ వయసు తగ్గింపు, వ్యవసాయ సబ్సిడీలు, ధరల స్థిరీకరణ నిధి, ఇల్లు లేని వారికి భూముల కేటాయింపు, ప్రాజెక్టుల పూర్తి, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులు, విద్యుత్ ఛార్జీల నియంత్రణ, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు వంటి హామీల్లో ఒక్కటైనా నెరవేరలేదని ఆమె మండిపడ్డారు. “గోరంత చేసి కొండంత చెప్పుకోవడం చంద్రబాబుకి మాత్రమే చెల్లుతుంది” అంటూ షర్మిల తన సంచలన వ్యాఖ్యలు చేశారు.