ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని తురుకపాలెం (Turukapalem) గ్రామంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 40 మంది ఒకే విధంగా మృతి చెందారు. తురకపాలెం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఇప్పటికే ఈ మరణాలపై ప్రతిపక్ష వైసీపీ(YSRCP) ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సైతం కూటమి ప్రభుత్వంపై ఫైరయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తురకపాలెంలో మరణాలు పెరుగుతున్నాయని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
షర్మిల మాట్లాడుతూ.. “తురుకపాలెం మరణ మృదంగం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. గత ఐదు నెలలుగా వరుస మరణాలు సంభవిస్తున్నా, వైద్యారోగ్య శాఖ కనీసం కదలిక లేకపోవడం సిగ్గుచేటు. అంతుచిక్కని వ్యాధి ఇంకా ఎంతమందిని బలిగొడుతుందోనని గ్రామస్థులు భయపడుతుంటే, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రాణభయంతో విలవిల్లాడుతున్న ఈ సమయంలో మహమ్మారిని అదుపు చేయడంలో ప్రభుత్వ వైఫల్యం అత్యంత బాధాకరమని ఆమె విమర్శించారు.
కాంగ్రెస్ డిమాండ్లు
తురుకపాలెం మృత్యుఘోషపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి.
వైద్యారోగ్య శాఖ తరఫున ఉన్నతస్థాయి కమిటీ నియమించాలి.
గ్రామంలోని ప్రతి ఒక్కరికి మెడికల్ టెస్టులు నిర్వహించాలి.
పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి.
మరణాలకు కారణం కల్తీ నీళ్లు, కల్తీ మద్యం లేదా పారిశుద్ధ్య లోపమా అనేది తక్షణం తేల్చాలి.
అలాగే, సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం బాధ్యత వహించాలని షర్మిల డిమాండ్ చేశారు.