‘కార్యకర్త కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుంది’ – వైఎస్‌ జగన్

‘అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుంది’ - వైఎస్‌ జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి వైఎస్ జగన్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. దివంగ‌త మ‌హానేత వైఎస్సార్‌ను గుండెల్లో పుట్టుకున్న ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు, నాయ‌కుల‌కు, అభిమానుల‌కు పార్టీ ఆవిర్భావ శుభాకాంక్ష‌లు తెలిపారు.

పేదవాడి కోసం పుట్టిన పార్టీ
“2011 మార్చి 12న నల్లకాల్వలో ఇచ్చిన మాట ప్రకారం, దివంగత మహానేత వైఎస్సార్ ఆశయ సాధన కోసం వైసీపీ ఆవిర్భవించింది. ఆనాడు పేదవాడి పక్షాన నిలబడేందుకు, విలువలు మరియు విశ్వసనీయతే పునాదులుగా ఈ పార్టీ పురుడుపోసుకుంది. వైసీపీ రాకతో దేశ రాజకీయాల్లోనే ఒక గొప్ప మార్పు కనిపించింది” అని జగన్ అన్నారు.

కుట్రలను అధిగమించి.. మార్క్ సృష్టించి..
పార్టీ ఆవిర్భావం తర్వాత ఎదుర్కొన్న సవాళ్లను గుర్తుచేస్తూ.. “ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చేతులు కలిపి నాపై కుట్రపూరితంగా అక్రమ కేసులు పెట్టాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ప్రజా మద్దతుతో వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డాం. ఈ రోజు దేశ రాజకీయాల్లోనే వైసీపీ తనకంటూ ఒక ప్రత్యేక మార్కును సృష్టించుకుంది” అని ధీమా వ్యక్తం చేశారు.

కార్యకర్తలే పార్టీ బలం
వైసీపీ ఏ ఒక్కరి సొత్తు కాదని, ఇది కొన్ని కోట్ల మంది అభిమానులకు చెందిన పార్టీ అని జగన్ స్పష్టం చేశారు. “రాబోయే రోజుల్లో ప్రతి అభిమాని, కార్యకర్త కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుంది. రాష్ట్ర దిశను, దశను మార్చడమే మన లక్ష్యం” అని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న వైసీపీ అభిమానులకు, కార్యకర్తలకు జగన్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment