ఉద్యోగులకు చంద్ర‌బాబు తీర‌ని మోసం.. లెక్క‌ల‌తో వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

ఉద్యోగులకు చంద్ర‌బాబు తీర‌ని మోసం.. లెక్క‌ల‌తో వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

చంద్ర‌బాబు స‌ర్కార్ (Chandrababu Government) ఉద్యోగుల‌కు (Employees) తీర‌ని మోసం చేస్తోంద‌ని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  (YS Jagan Mohan Reddy) తీవ్రంగా విమర్శించారు. వైసీపీ హయాంలో అమలు చేసిన పథకాలు, చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో (Manifesto)ను చూపిస్తూ ట్విట్ట‌ర్ వేదిక‌గా జగన్ మండిపడ్డారు. “ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా? IR, PRC, డీఏ పెండింగ్‌లు అన్నీ మాటలకే పరిమితమయ్యాయి” అంటూ ప్రశ్నించారు. దాదాపు రూ.31 వేల కోట్ల బకాయిలు ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ఆయన వివరించారు.

“ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియని దుస్థితి నెలకొంది. మా హయాంలో కరోనా సమయంలోనూ సకాలంలో జీతాలు ఇచ్చాం. కానీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు లేని సమయంలో కూడా జీతాల చెల్లింపులు లేవు. PRC ఛైర్మన్‌ను ఉద్దేశపూర్వకంగా తొలగించి, ఉద్యోగులకు పెంపు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు” అని ఆరోపించారు.

అలాగే అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, వాలంటీర్‌, సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించిన జగన్ – “మా ప్రభుత్వం ఆప్కాస్‌ ద్వారా దళారీ వ్యవస్థకు స్వ‌స్తి ప‌లికినా, చంద్ర‌బాబు తిరిగి ఆ వ్య‌వ‌స్థ‌ను తెచ్చారు. వాలంటీర్లకు జీతాలు పెంచుతామన్నారు, కానీ వారిని ఉద్యోగాల నుంచి గెంటేశారు. RTC ఉద్యోగులను మేం ప్రభుత్వ సిబ్బందిగా గుర్తించాం, కానీ మీ ప్రభుత్వం కొత్త నియామకాలకే అడ్డు” అని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీలో పనిచేస్తున్న దాదాపు 52 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్‌ చేశామ‌ని మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ గుర్తుచేశారు. ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ను కూడా మొదలుపెట్టామ‌న్నారు. అర్హులైన 10,117 మందిని గుర్తించి.. వీరిలో 3,400 మందికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు కూడా త‌న‌ హయాంలోనే ఇచ్చామ‌ని గుర్తుచేశారు. మిగిలిన వారికి అన్ని ప్రక్రియలు ముగిసినా కూడా ఇప్పటి వరకు అపాయింట్ మెంట్లు ఇవ్వకుండా, వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కూట‌మి ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు.

“ఉద్యోగులకు EHS, GPF, APGLI, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్ వంటి వాటిలో బకాయిలు పేరుకుపోయాయి. ఆస్పత్రులు వైద్యం నిరాకరిస్తున్న స్థితి వచ్చింది. OPS, GPS, CPS పునఃసమీక్ష హామీ ఇచ్చి ఏమీ చేయలేదు. 15 నెల‌ల‌ పాలనలో ప్రజలు, ఉద్యోగులు మీ చేతిలో మోసపోయారు” అంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment