భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్‌.. వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్‌.. వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ కావడంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం వైసీపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని వేగంగా పనులు చేపట్టిన జీఎంఆర్ సంస్థను ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ తన ట్వీట్‌లో విజ‌న్ వైజాగ్‌ లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ, విశాఖపట్నం కేంద్రంగా అభివృద్ధి దిశగా ఇది కీలక అడుగుగా పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో జీఎంఆర్ గ్రూప్ అసాధారణ కృషి చేసిందని కొనియాడారు. వైసీపీ పాలనా కాలంలో అనుమతులు వేగంగా పూర్తిచేసి, ప్రాజెక్ట్‌కు బలమైన పునాది వేశామని గుర్తుచేశారు.

ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు, నిర్వాసితుల పునరావాసం, భూసేకరణ కోసం సుమారు రూ.960 కోట్లను ఖర్చు చేసినట్లు వైఎస్ జగన్ తెలిపారు. ఈ చర్యల వల్లే ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యిందని, అప్పట్లో తీసుకున్న నిర్ణయాలే నేటి ఈ కీలక దశకు కారణమయ్యాయని ఆయన స్పష్టం చేశారు.

అలాగే, విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్‌పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకారాన్ని కూడా వైఎస్ జగన్ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. కేంద్రం–రాష్ట్రం సమన్వయంతోనే ఇలాంటి భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment