“MaViGUN” వెనుక ఉన్న ఎకానమిక్ లాజిక్ ఏంటి?

“MaViGUN” వెనుక ఉన్న ఎకానమిక్ లాజిక్ ఏంటి?

రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ, ఒక అభివృద్ధి నమూనాను కేవలం రాజకీయ కక్షతో ఎగతాళి చేయడం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ (MaViGun) ప్లాన్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఈ ప్లాన్ వెనుక ఉన్న ఆర్థిక తర్కం ఏంటి? ఇతర రాష్ట్రాలు ఇలాంటి నమూనాలతో ఎలా దూసుకుపోతున్నాయి? అమరావతి చుట్టూ అల్లిన ‘భ్రమల’ కంటే మావిగన్ ఎందుకు మేలైనది? అంటూ చ‌ర్చ జ‌రుగుతోంది.

అస‌లు కూట‌మి ప్ర‌భుత్వానికి ఆ పేరు న‌చ్చలేదా..? ఆ ప్ర‌తిపాద‌న జ‌గ‌న్ నుంచి రావ‌డం న‌చ్చ‌లేదా..? లేక అమ‌రావ‌తి కంటే మావిగ‌న్‌ ఇప్ప‌టికే 16 శాతం ఆదాయం సంపాదిస్తుండ‌డంతో మింగుడుప‌డ‌డం లేదా అని ప్ర‌శ్నిస్తున్నారు.

మావిగన్ అంటే ఏమిటి?
మచిలీపట్నం (Machilipatnam), విజయవాడ (Vijayawada), గుంటూరు (Guntur) – ఈ మూడు ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ రాజ‌ధాని కోసం వైఎస్‌ జ‌గ‌న్ ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాదించిన‌ భారీ ఇండస్ట్రియల్ కారిడార్ ఇది. మచిలీపట్నంలో పోర్టు సౌకర్యం ఉంది. విజయవాడలో ఎయిర్ పోర్టు, దేశంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్ ఉంది. గుంటూరు ఇండస్ట్రియల్ హబ్, వాణిజ్య కేంద్రం.

కేవలం 29 గ్రామాల అభివృద్ధిని మాత్రమే చూపిస్తున్న ప్రస్తుత అమరావతి నమూనా కంటే, 110 కిలోమీటర్ల పరిధిలోని 60కి పైగా గ్రామాలు, సుమారు 50 లక్షల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఈ ‘మావిగన్’ ప్లాన్ అత్యంత సహేతుకమైనదని, పైగా ప్ర‌భుత్వ భూములు కావాల్సిన‌న్ని ఉన్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు, రాజ‌కీయ విశ్లేష‌కులు.

దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్..
ఆర్ధిక నిపుణులు చెబుతున్నట్లుగా, ఇలాంటి ‘అక్రోనిం’ (పేర్ల కలయిక) ప్రాజెక్టులు కొత్తవి కావు. దేశంలో విజయవంతమైన ఎన్నో ప్రాజెక్టులు ఇలాంటి వ్యూహంతోనే నడుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతి కోసం సుమారు రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేయాలని భావిస్తోంది. కానీ ఇక్కడే ఒక ప్రాథమిక ప్రశ్న తలెత్తుతోంది. ప్రతి మంగళవారం ఆర్బీఐ వద్ద అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుండి తెస్తుంది?. గతంలో హైదరాబాద్ అనుభవాలను చూశాక కూడా, మళ్లీ మొత్తం సంపదను ఒకే చోట కేంద్రీకరించడం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి ప్రాంతాల పరిస్థితి ఏమిటి?. ఇప్పటి వరకు చేసిన అప్పుల్లో ప్రజలకు సంక్షేమం రూపంలో చేరింది 10 శాతం కూడా లేదని గణాంకాలు చెబుతుంటే, ఈ భారీ కట్టడాల వల్ల సామాన్యుడికి వచ్చే లాభం ఏంటి? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు, కానీ అది వాస్తవానికి దగ్గరగా ఉండాలి. జగన్ చెప్పిన మావిగన్ ప్లాన్ ద్వారా రాష్ట్ర జనాభాలో 20% ఉన్న ప్రాంతం నేరుగా అభివృద్ధి చెందుతుంది. ఇది కేవలం ఒక సూచన మాత్రమే కావొచ్చు, కానీ దీని వెనుక ఉన్న అంతర్జాతీయ స్థాయి ఆలోచనను గౌరవించాల్సిన అవసరం ఉంది. లేదంటే అటు ప్ర‌భుత్వం నుంచి మావిగ‌న్ ఎందుకు వొద్దో.. దాని వ‌ల్ల జ‌రిగే అనర్థాలు ఏంటో వివ‌రించాల్సిన బాధ్య‌త కూడా ఉందన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఎగతాళి ఎందుకు?
జగన్ ఏ పేరు పెట్టినా దానిపై విషం చిమ్మడం టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియాకు అలవాటు. ఒక ప్రాంతం పేరు ఎలా ఏర్పడింది అన్న దానికంటే, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఆ ప్రాంతం వ‌ల్ల ఎంత మేలు జరుగుతుందనేది ముఖ్యం. ‘అమరావతి’ అనే పేరుకు ఉన్న పౌరాణిక విలువను గౌరవిస్తూనే, అది కేవలం 29 గ్రామాల రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మిగిలిపోకుండా, ‘మావిగన్’ లాంటి బహుళ నగరాల అనుసంధానంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారాలి. అభివృద్ధి అనేది గ్రాఫిక్స్ లో కాదు, గ్రౌండ్ లెవల్ లో ప్రజల జీవన ప్రమాణాలు పెరగడంలో ఉండాలి. ఆ దిశగా అడుగులు వేయడం మానేసి, మాజీ ముఖ్య‌మంత్రి సూచనలను ఎగతాళి చేయడం విజ్ఞత అనిపించుకోదన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment