పబ్జీ గేమ్ యువకుడి ప్రాణాలు తీసింది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని గండేపల్లి మండలం ఎర్రంపాలెం గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటనతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. యువకుడు బుంగ బాబ్జీ తన స్నేహితుడు చందూతో కలిసి మొబైల్‌లో పబ్‌జీ గేమ్ ఆడుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
బుంగ బాబ్జీ పబ్జీ గేమ్ ఆడుతుండగా, సమీప ప్రాంతానికి చెందిన కాకడ చిన్ని అనే వ్యక్తి బాబ్జీని పలుమార్లు గేమ్ ఆపి ఇంటికి వెళ్ళమని హెచ్చరించినప్పటికీ అతను పట్టించుకోలేదు. దీనిపై ఆగ్రహానికి గురైన చిన్ని ఇంటికి వెళ్లి కత్తి తెచ్చి బాబ్జీపై దాడి చేశాడు. బాబ్జీ మెడపై కత్తితో నరికి తీవ్రంగా గాయపరిచాడు.
తీవ్రంగా గాయపడిన బాబ్జీని స్థానికులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, మార్గమధ్యంలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై గండేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్య గ్రామంలో తీవ్ర సంచలనానికి కారణమైంది.








