టీమిండియా (Team India) మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తండ్రి (Father), కోచ్ యోగ్‌రాజ్ సింగ్ (Yograj Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli)లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. యువరాజ్ కెరీర్‌ను నాశనం చేయడంలో వారి పాత్ర ఉందని పరోక్షంగా ఆరోపించారు.
ధోనీ, కోహ్లీలకు భయం
‘ఇన్‌సైడ్ స్పోర్ట్’ (Inside Sport)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ సింగ్ మాట్లాడుతూ, “డబ్బు, పేరు ప్రఖ్యాతులు ఉన్న చోట స్నేహితులు ఉండరు. అంతా వెన్నుపోటుదారులు మాత్రమే ఉంటారు. చాలా మందికి యువరాజ్ సింగ్ అంటే భయం. అతడు తన ప్రతిభతో తమ స్థానాలను ఆక్రమిస్తాడనే అభద్రతా భావంతో ఉండేవారు. ఎంఎస్ ధోనీ నుంచి ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ల వరకు అందరికీ యువరాజ్ అంటే భయమే. నా కొడుకు దేవుడు సృష్టించిన గొప్ప ఆటగాడు. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తప్ప అతడికి క్రికెట్ ప్రపంచంలో మంచి స్నేహితులు ఎవరూ లేరు” అని తెలిపారు.
యువరాజ్ కెరీర్
2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాల్లో యువరాజ్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 2011 ప్రపంచకప్‌లో 362 పరుగులు, 15 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును గెలుచుకున్నారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత యువరాజ్ కెరీర్ నెమ్మదించింది. 2017లో టీమిండియా తరపున చివరి మ్యాచ్ ఆడి, ఆ తర్వాత రెండేళ్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ధోనీపై యోగ్‌రాజ్ సింగ్ ఇలాంటి ఆరోపణలు చేయడం ఇది మొదటిసారి కాదు. అయితే, ఈసారి విరాట్ కోహ్లీని కూడా ఈ వివాదంలోకి లాగడం చర్చనీయాంశమైంది.







