ఉత్తర ప్రదేశ్‌లో మహా కుంభమేళా వేడుకల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ‘మా కి రసోయి’ అనే ప్రత్యేక కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించారు. వారణాసిలోని రాణి నెహ్రూ ఆస్పత్రిలో నంది సేవా సంస్థాన్ నిర్వహిస్తున్న ఈ కిచెన్‌లో కేవలం రూ.9కే ఫుల్ మీల్స్ అందించనున్నారు.
‘మా కి రసోయి’లో అందించే భోజనం భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించబడింది. భోజనంలో పప్పు, నాలుగు రోటీలు, అన్నం, కూర, సలాడ్, డెజర్ట్ అందించనున్నారు. ఈఆఫర్ కుంభమేళాకు వచ్చే భక్తులు, ఆస్పత్రికి వచ్చే రోగులకు కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ కమ్యూనిటీ కిచెన్ పూర్తిగా ఏసీ సౌకర్యంతో, ఆధునిక రెస్టారెంట్ తరహాలో నిర్మించబడింది. 2000 చదరపు అడుగులు విస్తీర్ణంలో, ఒకేసారి 150 మంది భక్తులు భోజనం చేయగల సామర్థ్యంతో నిర్మించబడింది.
మహా కుంభమేళా ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ఈ కార్యక్రమానికి ప్రాముఖ్యతనిస్తూ కొంతమందికి స్వయంగా భోజనం అందించారు. నందగోపాల్ సహా మంత్రులు వంటగదిలో చేసిన ఆహార పదార్థాలను పరిశీలించారు.