భూఆక్రమణలంటూ తనపై వస్తున్న వార్తలను, జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 2001లో కొనుగోలు చేసిన భూమిని ఆక్రమణలు అంటూ తనపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం మొదలుపెట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తనపై తప్పుడు ప్రచారం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరదీసిందన్నారు. తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.
2001లో కొనుగోలు చేసిన భూములలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలోనే రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారన్నారు. 25 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి ఆక్రమణ అంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం విచారణ జరిపి అటవీ భూములు లేవని తేల్చిందని గుర్తుచేశారు. అంతకంటే ముందు కిరణ్ కుమార్ ప్రభుత్వం కూడా విచారణ చేపట్టింది. అప్పుడు కూడా అటవీ భూములు కాదని తేల్చారన్నారు. తనపై తప్పుడు కథనాలు రాసి ప్రసారం చేసిన ఈనాడు, ఈటీవీ యాజమాన్యంపై పరువు నష్టం దావా వేస్తాను అని పెద్దిరెడ్డి హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేసిందని, ప్రజల నుంచి విమర్శలు వస్తుండటంతో భూఆక్రమణలు అంటూ తనపై దుష్ప్రచారం చేస్తూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు అందరికీ తెలుసన్నారు. ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.







