ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితులు కొత్త ఊతం పొందుతున్నాయి. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించకపోవడంతో తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీ చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా విజయవాడలో ఆందోళనలు నిర్వహించింది. ప్రభుత్వంపై పోరాటం ప్రకటించింది.
ప్రభుత్వ వైఫల్యాలు
వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ప్రభుత్వ పనితీరును తప్పుపట్టారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా, ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదని విమర్శించారు. అంతేకాకుండా, అమలు చేయాల్సిన పథకాలు అమ్మ ఒడి, రైతుల పెట్టుబడి సాయం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, మహిళలకు 1500 రూపాయలు వంటి పథకాలు నీరుగార్చారని ఆయన ఆరోపించారు.
ప్రశ్నిస్తే కేసులు..
ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడుతున్నారని దేవినేని అవినాష్ మండిపడ్డారు. ఈ విధానం ప్రజల హక్కులను హరించే ప్రయత్నమే అని ఆయన చెప్పుకొచ్చారు.
మళ్లీ జగనే
కూటమి ప్రభుత్వం చేసే నిరంకుశ పాలనపై ఆయన తీవ్రంగా మండిపడుతూ, ప్రజలు త్వరలోనే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ను ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఇప్పటికే చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా, మళ్లీ ముఖ్యమంత్రిగా జగనే విజయం సాధిస్తారని, కూటమికి గుణపాఠం తప్పదని హెచ్చిరించారు.







