కూటమి పాలనలో తిరుపతి పవిత్రత మంట కలిసింది – భూమ‌న‌

కూటమి పాలనలో తిరుపతి పవిత్రత మంట కలిసింది - భూమ‌న‌

తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో కూటమి ప్ర‌భుత్వం అరాచకం సృష్టించింద‌ని వైసీపీ సీనియ‌ర్ నేత భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి అన్నారు. మెజారిటీ లేకున్నా డిప్యూటీ మేయర్‌ పీఠంపై టీడీపీ కన్ను వేసింద‌ని, వైసీపీ కార్పొరేటర్లకు బెదిరించి, భ‌య‌పెట్టి, దాడులు చేసి ప‌ద‌వి ద‌క్కించుకోవాల‌ని చూస్తోందంటూ భూమ‌న క‌రుణాక‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎలాగైనా డిప్యూటీ మేయ‌ర్ పదవి దక్కించుకునేందుకు అరాచక పర్వం సృష్టించార‌ని టీడీపీకి అనుకూలంగా ఓటేసినా, లేదా ఎన్నికలకు గైర్హాజరు అయినా ఒక్కో కార్పొరేటర్‌కు రూ.50 లక్షలు ఇస్తామని ప్రలోభపెడుతున్నారన్నారు. ప్రలోభాలకు లొంగని కార్పొరేటర్ల ఆస్తులు ధ్వంసం చేస్తామని బెదిరిస్తున్నారన్నారు.

డిప్యూటీ మేయర్‌ ఎన్నిక శాశ్వతంగా వాయిదా వేయాల‌ని భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీకి చెందిన న‌లుగురు కార్పొరేట‌ర్ల‌ను టీడీపీ కిడ్నాప్ చేసిందని, వారు ఎక్కడున్నారో కుటుంబ సభ్యులకు కూడా తెలియని పరిస్థితి నెల‌కొంద‌న్నారు. ఎన్నికల కమిషన్‌ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాల‌న్నారు. దాదాపు 200 మంది పోలీసుల సమక్షంలో అంద‌రూ చూస్తుండగానే బస్సు ధ్వంసం చేసి వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశార‌న్నారు. దీనిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే ఈ విష‌యాన్ని చాలా తేలిక‌గా తీసుకుంటున్నార‌న్నారు. కార్పొరేట‌ర్ల కిడ్నాప్‌న‌కు సంబంధించి హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్ దాఖ‌లు చేసిన‌ట్లు వివ‌రించారు.

కూటమి పాలనలో తిరుపతి పవిత్రత మంట కలిసిందని భూమ‌న అన్నారు. జ‌నసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆయ‌న‌ కుమారుడు దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని, వీరి అరాచకాలపై పవన్‌కళ్యాణ్‌ స్పందించాల‌న్నారు. స‌నాతన ధర్మాన్ని పరిరక్షించడమంటే ఇదేనా? అని డిప్యూటీ సీఎంను ప్ర‌శ్నించారు. అధికార పార్టీ బెదిరింపులకు వెనక్కి తగ్గేదే లేదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆత్మార్పణకైనా సిద్ధ‌మ‌ని భూమ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment