రెజ్లర్ సుశీల్ కుమార్‌కు షాక్: బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు

రెజ్లర్ సుశీల్ కుమార్‌కు షాక్: బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు

భారత ప్రముఖ రెజ్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హత్య కేసులో నిందితుడైన సుశీల్‌కు గత మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సుశీల్ కుమార్ వారం రోజుల్లోగా కోర్టుకు లొంగిపోవాలని ఆదేశించడంతో, అతను మళ్లీ జైలుకు వెళ్లనున్నాడు.

2021లో ఒక ఆస్తి వివాదానికి సంబంధించిన వ్యవహారంలో సుశీల్‌ తదితరులు కలిసి సాగర్‌ ధన్‌కర్, అతని మిత్రులపై తీవ్ర దాడికి పాల్పడ్డారు. గాయాలతో ఆ తర్వాత సాగర్‌ మృతి చెందాడు. ఈ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత, సుశీల్ పరారీలో ఉండి చివరకు పోలీసులకు లొంగిపోయాడు.

బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత సుశీల్ సాక్షులను ప్రభావితం చేశాడని సాగర్ తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, సుశీల్‌కు ఉన్న గుర్తింపు కారణంగా అతను విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అందుకే, కేసు తీవ్రతను బట్టి బెయిల్ ఇవ్వడం సరికాదని చెబుతూ, ఢిల్లీ హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. అయితే, భవిష్యత్తులో సుశీల్ మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం మాత్రం ఉంది. ఈ తీర్పుతో సుశీల్ మళ్లీ జైలు జీవితం గడపక తప్పదు.

Join WhatsApp

Join Now

Leave a Comment