సెమీస్‌ ముందు భారత్‌కు షాక్.. ఆ ప్లేయర్ రీ-ఎంట్రీతో ఆస్ట్రేలియా పటిష్టం!

సెమీస్‌ ముందు భారత్‌కు షాక్.. ఆ ప్లేయర్ రీ-ఎంట్రీతో ఆస్ట్రేలియా పటిష్టం!

మహిళల వన్డే (Women’s ODI)ప్రపంచకప్ (World Cup) 2025లో కీలకమైన రెండో సెమీఫైనల్ గురువారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆరుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా (Australia)ను టీమిండియా (Team India) ఢీకొట్టనుంది. లీగ్ దశలో ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత జట్టు చూస్తుండగా, ఈ కీలక సమరానికి ముందు హర్మన్ సేనకు ఒక బ్యాడ్‌న్యూస్ ఎదురైంది. గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ అలైస్సా హీలీ సెమీఫైనల్లో తిరిగి రంగంలోకి దిగనుంది.

అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, హీలీ ఫిట్‌నెస్ టెస్ట్‌ను క్లియర్ చేసినట్లు సమాచారం. ఆమె ఇప్పటికే నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. సెమీస్‌ వంటి ముఖ్యమైన మ్యాచ్ కావడంతో హీలీ ఆడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. హీలీ ఫుల్ ఫామ్‌లో ఉండటం టీమిండియాకు కష్టాలను పెంచనుంది. గాయానికి ముందు ఆడిన రెండు మ్యాచ్‌లలో (భారత్‌పై కూడా) ఆమె సెంచరీలు చేసింది. ఈ మెగా టోర్నీలో 4 మ్యాచ్‌ల్లో 98 సగటుతో ఏకంగా 298 పరుగులు చేసింది.

ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అజేయంగా సెమీస్‌కు చేరింది. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించి, అద్భుతమైన ఫామ్‌లో ఉంది. మరోవైపు, భారత్ జట్టు లీగ్ దశలో మూడు విజయాలు, మూడు అపజయాలు నమోదు చేసి, న్యూజిలాండ్‌పై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ కీలక మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే, అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment