తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. చెయ్యి ఎత్తితే బస్సు ఆపలేదని డ్రైవర్‌ను చితకబాదడం, బస్సులో కండక్టర్లతో వాగ్వాదం, దాడులు చేయడం వంటి వార్తలు చూశాం. ఫ్రీ బస్ పథకాన్ని ఉపయోగించుకుంటూ మహిళలు కూరగాయలు కట్ తరగడం, గోరింటాకు పెట్టుకోవడం వంటి హాస్యాస్పద సన్నివేశాలను తిలకించాం. కానీ, వనపర్తి జిల్లా ఘణపురం బస్టాండ్‌లో గురువారం జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.
ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకొని పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. మొదట వీరు సీట్లు కోసం వాగ్వాదానికి దిగారు. ఆ వాదన మరింత తీవ్రమై, వారు బస్సు నుంచి దిగి జుట్టు పట్టుకొని, చీపురు కట్టలతో ఒకరిపై ఒకరు దాడి చేయడం కలకలం రేపింది.
ఈ ఘటనను పక్కనే ఉన్న తోటి ప్రయాణికులు వీడియో తీశారు. వారు గొడవను ఆపడానికి ప్రయత్నించినా, మహిళలు ఆగలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.







