ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో జరిగిన మరో దారుణమైన ఘటన మహిళలు (Women) ఒంటరిగా బయట తిరగాలంటేనే భయభ్రాంతులకు గురిచేస్తోంది. రన్నింగ్ ట్రైన్ (Running Train)లో మహిళను కత్తితో బెదిరించి, ఆమె వద్ద డబ్బు, నగలు లాక్కున్న అనంతరం ఆ మహిళపై అత్యాచారం చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. రాజమండ్రి (Rajahmundry) నుండి సంత్రగచి (Santragachi) ప్రత్యేక రైలు ఎక్కిన ఒక మహిళ, గుంటూరు చేరుకునే సమయానికి ఆమె ప్రయాణిస్తున్న బోగీ పూర్తిగా ఖాళీగా మారింది. ఈ నేపథ్యంలో సుమారు 40 ఏళ్ల వయసున్న ఓ ఉన్మాది ఆ బోగీ ఎక్కి ఒంటరిగా ఉన్న మహిళను కత్తితో బెదిరించి హ్యాండ్‌బ్యాగ్, మొబైల్ ఫోన్, నగదు లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా ఒంటరిగా ఉన్న ఆ మహిళపై కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
గుంటూరు నుంచి పెదకూరపాడు మధ్య రైలులో ఈ సంఘటన చోటు చేసుకుంది. దుండగుడు మహిళను బెదిరించి రన్నింగ్ ట్రైన్‌లోనే అత్యాచారం (Rape) చేశాడు. అనంతరం పెదకూరపాడు రైల్వే స్టేషన్ వద్ద రైలు ఆగగానే, ట్రైన్ నుండి దిగి పరారయ్యాడు. షాక్‌కు గురైన బాధితురాలు ట్రైన్ చర్లపల్లి స్టేషన్‌కు చేరుకున్న తర్వాత జీఆర్పీ (రైల్వే పోలీసులకు) ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. పెదకూరపాడు రైల్వే స్టేషన్ పరిసరాల్లో సీసీటీవీ వీడియోలను పరిశీలిస్తూ నిందితుడి కదలికలపై క్లూస్ సేకరిస్తున్నారు. మహిళపై జరిగిన ఈ దారుణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది.





 



