ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (Mumbai International Airport )లో సోమవారం అర్ధరాత్రి భారీ డ్రగ్స్ (Huge Drugs) పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. దోహా (Doha) నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద అధికారులు సుమారు రూ.62.6 కోట్ల విలువైన హై గ్రేడ్ (High Grade) కొకైన్ (Cocaine)ను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఒరియో, చాక్లెట్ బాక్సుల్లో డ్రగ్స్
విశ్వసనీయ సమాచారం మేరకు దోహా నుంచి వచ్చిన మహిళ(Women) లగేజీని జాగ్రత్తగా పరిశీలించిన అధికారులు ఆరు ఒరియో బాక్సులు, మూడు చాక్లెట్ బాక్సుల్లో 300 డ్రగ్ క్యాప్సూల్స్ ఉన్నట్టు గుర్తించారు. అనంతరం వాటిని పరీక్షించగా, అందులో హై క్వాలిటీ కొకైన్ ఉన్నట్టు తేలింది.
6.26 కిలోల కొకైన్
పట్టుబడిన కొకైన్ మొత్తం 6,261 గ్రాములు (అంటే 6.26 కిలోల వరకు) ఉండగా, దాని అంతర్జాతీయ మార్కెట్ విలువ రూ.62.6 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం (NDPS Act), 1985 కింద అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్‌ను ఎక్కడికి తరలించాలనుకున్నదీ, ఎవరి కోసం తీసుకువస్తున్నదీ అన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. అరెస్టైన మహిళకు చెందిన డ్రగ్స్ నెట్‌వర్క్, ముఠా సభ్యులు, ఇతర దేశీయ, అంతర్జాతీయ లింకులు ఉన్నాయా అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో కేంద్ర నిఘా సంస్థలు, ముంబై ఎయిర్‌పోర్టు భద్రతా బలగాలు అప్రమత్తమవుతున్నాయి.