తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీలో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతోంది. దాని ప్రభావంతో ఛత్తీస్‌గఢ్, మరాఠ్వాడా, కర్ణాటక వరకు ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో నేడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రేపు ఏపీలో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలో..
తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఈదురు గాలులు, పిడుగుల ప్రభావం వల్ల ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.