ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. సాక్ష్యాత్తూ డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది. కాగా, మూడు ఎమ్మెల్సీ నియోకవర్గాల్లోనూ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి.
పిఠాపురంలో..
కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నేతలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. పోలింగ్ కేంద్రం ఎదురుగా ఓటర్ల లిస్ట్‌లు పట్టుకొని పేరాబత్తుల రాజశేఖర్‌కి ఓటు వేయాలని కూటమి నేతలు ఓటుకు రూ.3 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పోలీసులు కూడా కూటమి నేతలకు సపోర్టు చేస్తున్నారని, నిజాయితీగా గెలిచే దమ్మూ, ధైర్యం లేదా అని మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు.
కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఓటర్లకు డబ్బుల పంపిణీ #AndhraPradesh #MLCElections #TeluguFeed pic.twitter.com/kMl0rG6UQx
— Telugu Feed (@Telugufeedsite) February 27, 2025
కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతలు ఓటుకు రూ.2 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతలు నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చంద్రపాలెం స్కూల్‌లో నేరుగా వాహనంతో ప్రవేశించినా, అధికారులు ఏ చర్య తీసుకోలేదు.